March 4, 2013

ఇది దోపిడీ 'ఆధార్'!

పేదల సొమ్ము తినే కుట్ర: బాబు

విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్నిరకాల దోపిడీలు అయిపోయాయని, ఆధార్ పేరుతో పేదల డబ్బులు కాజేసేందుకు కాంగ్రెస్ దొంగలు కుట్ర పన్ను తున్నారన్నారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి వద్ద ఆయన సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. పామర్రు, బలిపర్రు, పెదమద్దాలి, జమ్మిగొల్లేపల్లి, కొమరవోలు మీదుగా 16 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పామర్రులో జరిగిన సభలో ప్రభుత్వం, విద్యా విధానాన్ని తూర్పారబట్టారు.

" దేశ పురోభివృద్ధికి తోడ్పడే విద్యావ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దానివల్ల ఈనాడు సమాజం పెడదోవ పట్టే ప్రమాదం ఉంది. ఈ పాపం కాంగ్రెస్‌కు తగిలి తీరుతుంది''అని ఆక్షేపించారు. కోతల వల్ల విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతమన్నారు. " కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఎన్టీరామారావు లాంతరు కింద చదువుకుని మహానుభావుడయ్యారు. ఆ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకెళ్లాలి. కరెంటు కష్టాలకు కుంగిపోవద్దు. లాంతర్ల సాయంతోనైనా చదువు కొనసాగించాల''ని ఉత్సాహపరిచారు.

అభివృద్ధి చెందిన దేశాలలో ప్రభుత్వాలు విద్యని ఉచితంగా అందిస్తుండగా, మనదేశంలో మాత్రం ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఏడేళ్లలో రెండు డీఎస్సీలకు నోటిఫికేషన్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో బొజ్జలు నింపుకోవడం తప్ప కాంగ్రెస్ మంత్రులు విద్యావ్యవస్థపై దృష్టి సారించలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని అనాథని చేశారని విమర్శించారు. వైఎస్ హయాంలో దొంగలు రాజ్యమేలారని, వారిలో కొందరు ఇప్పుడు జైళ్లలో ఉండగా, మరికొందరు కిరణ్ కేబినెట్‌లో కొనసాగుతున్నారన్నారు.

అధినాయకుడు బావయ్యే : బాలయ్య
తెలుగుదేశం పార్టీకి ర థసారథి, నాయకుడు, అధినాయకుడు చంద్రబాబు నాయుడేనని , రెండో పవర్ సెంటర్‌కు తావులేదని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. లోకేశ్ అయినా మరెవరయినా పార్టీలో కష్టపడి పని చేయాల్సిందేనన్నారు. సోమవారం పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. కృష్ణా జిల్లా కొమరవోలులో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధమన్నారు. పాదయాత్రకు మంచి స్పందన ఉందని, 2014లో టీడీపీకి అధికారం త«థ్యమని చెప్పారు.