March 4, 2013

ఆ మహానుభావుడి గడ్డపై నడక!

అది పేరున్న పట్టణం.. నాలుగు ప్రధాన నగరాలకు అది జంక్షన్.. అంతకన్నా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఓ మహానుభావుడు జన్మించిన ప్రాంతం.. ఇంతటి విశిష్టత కలిగిన ప్రాంతం సహజంగానే అభివృద్ధి చెందాలి. నాలుగు వైపుల నుంచి వీచే గాలులతో ప్రగతిలో ముందుండాలి. దేశంలో ఎక్కడైనా అలా జరుగుతుందేమో తెలియదు.

కానీ, ఆ ప్రాంతం మన రాష్ట్రంలో ఉండటం..అందులోనూ టీడీపీకి కంచుకోట కావడంతో పామర్రు నిర్లక్ష్యపు నీడలోకి జారిపోతోంది. తారక రామారావు నడియాడిన ఈ గడ్డ గుండా నడుస్తుంటే ఆ మహానుభావుడి జ్ఞాపకాలు ముసురుకున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధం మనసులో మెదిలింది. ఎదురైన ప్రతివారూ మామయ్యను గుర్తుచేయడం ఆనందం కలిగించింది. అదేసమయంలో రోడ్డు నుంచి అభివృద్ధి పనులు, పక్కా ప్రభుత్వ భవనాల దాకా.. ఎక్కడా నాటి రూపురేఖలు కనిపించకపోవడం చాలా బాధనిపించింది. ఇలాంటి రద్దీ ప్రాంతం కనీస సౌకర్యాలకైనా నోచుకోకపోవడం రాజకీయ వివక్ష కాదా?

పామర్రు నుంచి కనుమూరుకు దారితీసిన నాకు, ఈ పాలకుల అభివృద్ధిని వెక్కిరిస్తూ ఆ మెగా వాటర్ స్కీమ్ కనిపించింది. నా హయాంలో ఇక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాను. కోటి ముఫ్ఫై లక్షలు మంజూరు చేసినట్టు గుర్తు. అప్పుడు చేసిన పనులే తప్ప మరేమీ కదలిక లేదట. ఇప్పటికీ అది అందుబాటులోకి రాలేదట. ఈ వేసవి ఎద్దడి నుంచి ప్రజలను కంటిరెప్పగా రక్షించే స్కీమ్ ఇది. నా మీద రాజకీయ పోరాటం చేయాల్సిందిపోయి, ఈ అమాయకులను కాల్చుకు తింటున్నారు. ఇదెక్కడి న్యాయం? వీళ్లకసలు పుట్టగతులు ఉంటాయా?