March 3, 2013

సాగునీరివ్వలేక చేతులేత్తేశారు


జలయజ్ఞంకోసం రూ.80 వేల కోట్టు ఖర్చుపెట్టినాఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు యివ్వక రాష్ట్రంలోని రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పలు యిబ్బందులకు గురిచేసిందని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. పామర్రు నియోజకవర్గం భట్లపెనుమర్రు, పెడసనగల్లులో జరిగిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కాగ్ నివేదికలో జలయజ్ఞంలో రూ.30వేల కోట్లు అవినీతి జరిగిందని బయటపడిందన్నారు. మూడు సీజన్‌ల నుంచి ఆధునికీకరణ పేరుతో నీరు ఇవ్వకపోవడంతో ఒక్కొక్క రైతు ఏడాదికి రూ.10వేలు నష్టపోతున్నాడన్నారు. ఆరువందల కోట్ల రూపాయలతో పులిచింతల పూర్తయ్యేదని, దానిని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి తొమ్మిదేళ్ళకాలంలో ముఖ్యమంత్రిగా చేసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు. రిజర్వాయార్లలో 510 అడుగులు నీరువున్నా సాగునీరు యివ్వలేని కిరణ్‌కుమార్‌రెడ్డి, రైతుల రుణమాఫీపై తెలుగుదేశం వైఖరిని ప్రశ్నించడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు.

వర్గీకరణపై కాంగ్రెస్‌కు సవాల్

వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంచేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. వర్గీకరణకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మాదిగలకు రిజర్వేషన్‌లు అమలు సక్రమంగా జరగడంలేదంటూ, 40ఏళ్ళలో 16 వేల ఉద్యోగాలు మాదిగలకు దక్కగా, టీడీపీ చేసిన వర్గీకరణ అమలుతో నాలుగేళ్ళలో 24 వేల 500 ఉద్యోగాలు లభించాయన్నారు. వర్గీకరణపై 2004లో కొందరు కోర్టుకు వెళ్ళడంతో ఆటంకం ఏర్పడిందని, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సక్రమంగా స్పందించి ఉంటే న్యాయం జరిగేదన్నారు.

ముందుచూపులేని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు

పమిడిముక్కల మండలం హనుమంతాపురంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ అవసరాలపై ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు ముందు చూపులేకపోవడం వల్లేనే ప్రస్తుత సంక్షోభానికి కారణమన్నారు. అధికారంలోకి రాగానే మహిళల రక్షణకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తానని బాబు అన్నారు.