March 3, 2013

ప్రభుత్వ విధానంతో రైతులకు కష్టాలు


రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల కృష్ణా జిల్లాలోని మినుము రైతు, కౌలు రైతులు దారుణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ధ్వజమెత్తారు. మినుము రైతుకు గిట్టుబాటు ధర లేనప్పుడు 2002- 03 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఆలోచన చేయకుండా చోద్యం చూడటం వల్ల జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో 1 లక్షా 63 వేల హెక్టార్లలో రైతులు మినుము పంట వేశారని చెప్పారు. రూ.4,300 మద్దతు ధర పలుకుతుండగా బర్మా నుంచి మినుములు దిగుమతి అవుతున్నాయన్న పేరుతో రూ.3,600- 3,700 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2002-03లో నాఫెడ్ మినుములను కొనగా ఇప్పుడెందుకు ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయించటం లేదని ప్రశ్నించారు.

జిల్లా మంత్రి పార్థసారథి, వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డి, రైతు బాంధవుడిగా చెప్పుకునే పిన్నమనేని వెంకటేశ్వరరావు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖరీఫ్‌లో నీళ్ళు రాకపోవటం వల్ల రైతాంగం నష్టపోయిందని చెప్పారు. కౌలు రైతులు ఎకరాకు రూ.10 - 15 వేల మేర పెట్టుబడి పెట్టారని, మద్దతు ధర లేక, నీళ్ళు లేక మొదటి పంటను నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు. మరోసారి మినుము రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి నాఫెడ్ ద్వారా రైతుల నుంచి మినుమును కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.