March 3, 2013

మైనారిటీలపై కేంద్రం వివక్ష: టీడీపీ

ఒక్కో ముస్లింలకు రెండు వందలేనా?

బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి ఒక్కొక్కరికి కేవలం రూ. 200 చొప్పున కేటాయించారని, ఇంత దారుణం మరొకటి ఉండబోదని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ప్రభుత్వ చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సాకు చెబుతూ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోందని మండిపడింది. శనివారం ఆ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లాల్‌జాన్ భాషా, మీడియా విభాగం సభ్యుడు సలాం, పొలిట్ బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.

"ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 15 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారి సంక్షేమానికి కేవలం రూ. 3 వేల కోట్లు కేటాయించారు. అంటే అది ఒక్కొక్కరికి రూ.200 వస్తుంది. మైనారిటీలపై వివక్షకు ఇదే నిదర్శనం. నా కోటా కింద వచ్చే రూ.200లను ఆర్థిక మంత్రికే పంపుతాను. ఆయననే ఉంచుకోమనండి'' అని బాషా అన్నారు. ఇతర దేశాల్లో ఉంటున్న ముస్లింలు సంపాదిస్తూ పంపుతున్న సొమ్ముపై పన్ను రూపేణా ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తోందని... అయినా వారి కోసం డబ్బు వెచ్చించాలంటే ప్రభుత్వానికి మనసు రావడం లేదని విమర్శించారు.

కాగా.. ప్రభుత్వ చమురు కంపెనీలు లాభాలు ప్రకటిస్తుంటే.. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతోందని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. "ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు 2011-12లో రూ. 3955 కోట్ల లాభం వచ్చింది. బీపీసీఎల్‌కు రూ. 6259 కోట్లు లాభం వచ్చింది. కానీ, వాటికి నష్టాలు వస్తున్నాయని కేంద్రం చెబుతోంది'' అని ఆయన ఆరోపించారు. యూపీఏ అధికారంలోకి అధికారంలోకి రాకముందు పెట్రోలు రూ. 37 ఉంటే ఇప్పుడు రూ. 77 అయిందని.. డీజిల్ రూ. 24 నుంచి రూ. 52కు పెరిగిందని చెప్పారు.