March 3, 2013

పోరాటానికి కలిసి రండి

దండం పెడతాం.. చేతులు కలపండి: టీడీపీ
సీఎం, పీసీసీ చీఫ్‌ల వైఖరిపై ధ్వజం..
టీఆర్ఎస్ తీరుపైనా మండిపాటు

బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం తీర్పు వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదిస్తున్న టీడీపీ.. ఈ అంశంపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు క్షేత్రస్థాయి ఉద్యమాలకు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి గోదావరి బేసిన్‌లోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ధర్నాలు, ప్రదర్శనలు జరపాలని ఆ పార్టీ నిర్ణయించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు.

ఆయా జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అంతకన్నా ముందే ముఖ్యమంత్రికి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. శనివారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ ప్రాంత నేతలు తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు, ఇ. పెద్దిరెడ్డి, వేనేపల్లి చందర్రావు విలేకరులతో మాట్లాడారు. 'సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడిన తీరును చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారు. బాబ్లీ వల్ల ఏ నష్టం లేదని వాదిస్తున్నారు. అదే నిజమైతే బాబ్లీకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారు? ' అని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకొని ఆ మత్తులో జోగుతున్న టీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలను వదిలిపెట్టి బాబ్లీ నిర్మాణాన్ని సమర్థించిందని, ఈ నష్టానికి పాపం అంతా ఆ పార్టీదేనని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంటే సీఎం, పీసీసీ అధ్యక్షుడు బలుపుతో మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. 'బాబ్లీ సహా మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 13 అక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని మేం కేంద్ర జల సంఘానికి ఇచ్చాం. అవి చెక్‌డ్యాములని ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు సమాధానం ఇచ్చింది. దేశంలో నదీ జలాలపై వేసిన కమిటీలేవీ పనిచేయడం లేదు. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. బాబ్లీ ప్రాజెక్టును కేంద్రం స్వాధీనం చేసుకొని తన ఆధీనంలో నిర్వహించాలి. అప్పుడే మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది.

బాబ్లీపై రాష్ట్రం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి. ఈ ప్రాజెక్టు కోసం పోరాటంలో మాకు పేరు వస్తోందన్న ఏకైక కారణంతో టీఆర్ఎస్ వంటి పార్టీలు బాబ్లీని సమర్థిస్తున్నాయి. మాకు ఏ పేరూ అక్కర్లేదు. చేతులెత్తి మొక్కుతున్నాం.. అన్ని పార్టీలూ కలిసి రావాలి. అందరం కలిసి పోరాడదాం. ప్రభుత్వం మెడలు వంచుదాం' అని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

ఎత్తిపోతల పథకాల్లో కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత వందల టీఎంసీల నీటిని తేలిగ్గా తోడేయగలుగుతున్నారని, పేరుకు బాబ్లీ ప్రాజెక్టు సామర్థ్యం రెండు టీఎంసీలే అన్నా దాని ఆధారంగా వందల టీఎంసీల నీటిని ఎగువన వాడుకొనే పరిస్ధితి ఉందని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్లనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాం తంలో మహారాష్ట్ర బాబ్లీప్రాజెక్టు నిర్మించిందని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. శనివారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో విలేకరులతో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ తరపున మరోసారి సుప్రీంను ఆశ్రయిస్తామన్నారు.