March 3, 2013

ఇంకెక్కడి వ్యవ'సాయం'?

పేరుకే జమిందారీ హోదా. కోటు లోపలి చొక్కా చూస్తే అన్నీ చిరుగులే. ఆ ఊరికి వెళ్లినప్పుడు కనిపించిన దృశ్యం కూడా ఇలాంటిదే. ఊరిలో చాలా మిద్దెలు కనిపించాయి. ఈ ఊరికి ఒక మంచి గతమున్నదనేందుకు ఈ మిద్దెలే సాక్ష్యం. కనుమూరులో ఎదురైన రైతులకూ.. వారుంటున్న నివాసాలకూ పొంతన లేదు. మొదట కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఆ రైతులతో మాట్లాడిన తరువాత నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి.

వారంతా ఒకప్పుడు మోతుబరి రైతులే. అప్పుడు కట్టుకున్న మిద్దెలివి. ఆ తరువాత ఓడలు బళ్లయిపోయాయి. కానీ, ఆ ఛాయలు మిద్దెల రూపంలో మిగిలి ఉన్నాయి. వాళ్లతో మాట్లాడుతూనే ఇళ్లవైపు చూశాను. గోడలు బీటలు వారి ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించడానికి తమకు స్తోమత లేదని చెప్పుకొచ్చారు. నలుగురికి పని చూపించి, తిండి పెట్టిన చేతులివేనా!

ఆరోగ్య శ్రీ ఉందని అసలు వీళ్లకు తెలుసా? మంచం పట్టిన ఆ ఊరిని చూసినప్పుడు కలిగిన అనుమానమిది! ఊరంతా మంచం పట్టింది. మందూమాకు వేయాల్సిన ఆసుపత్రులు పడకేశాయి. కూలిలో చాలా భాగం ఒళ్లు బాగు చేయించుకోవడానికే పోతున్నదట. కాస్త స్తోమత ఉన్నవారు.. సంపాదించిన ఆ కాస్త డబ్బునూ జబ్బులకు పోయాల్సి వస్తోంది.

ఒక కుటుంబం ఒక ఏడాదిలో ఆస్పత్రులకు ఖర్చు పెట్టింది అక్షరాల రెండు లక్షల ఇరవై వేలు. ఆ ఇంటి యజమాని వైద్య బిల్లులు చూపిస్తుంటే ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. వీరిలో ఎక్కువమంది ఆరోగ్య శ్రీకి అర్హులే. కార్పొరేట్ వైద్యం అవసరం అయినవారే. పంటపై తీసేది తక్కువ.. రోగాలకు పోయేది ఎక్కువగా ఉన్నదని కపిలేశ్వరపురంలో ఆ రైతు వాపోయాడు. ఇంకెక్కడి వ్యవ'సాయం'?