March 27, 2013

పేదల అభివృద్ధి,రైతుల సంక్షేమమే ధ్యేయం

అనపర్తి : పేదల అభివృద్ధి, రైతుల సంక్షేమమే ధ్యేయమని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చేపట్టిన 'వస్తున్నా... మీకోసం' కోసం పాదయాత్ర మంగళవారం అనపర్తి మండలంలో కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పెడపర్తి రేవులో బస చేసిన ప్రదేశంలో ముమ్మిడివరం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పెడపర్తి రేవు నుంచి చంద్రబాబు పాద యాత్ర మొదలుపెట్టారు. పెడపర్తి, కుతుకులూరు, రామవరం గ్రామాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని, విద్యుత్ సర్‌ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తోందనానరు.

ఈ ఛార్జీలు సర్‌ఛార్జీలు కాదని, వైఎస్ పాలనలో దోచుకున్న దోపిడీకి ప్రస్తుతం ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ములని బాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల దోపిడీలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. పన్నుల రూపంలో ఎంత సొమ్ము వసూలు చేసినప్పటికీ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని, ప్రతి నిరుపేదకు ఇంటి స్థలాన్ని ఇచ్చి రూ.1.50 లక్షలతో గృహ నిర్మాణం చేపడతామన్నారు. ఒక్కసారి తమ పార్టీకి అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టే అవకాశాన్ని కల్పించాలని ఆయన కోరారు.

పాదయాత్ర ప్రారంభం నుంచి అశేష జనవాహిని వెంట రావడంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు.

పెడపర్తి వద్ద పొలాల్లో కూలిపని చేసుకుంటున్న వారి వద్దకు వెళ్ళి కష్ట
సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీలలో కార్మికులు తయారు చేస్తున్న ఇటుకలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారి యోగ క్షేమాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కుతుకులూరులోని బజ్జీల దుకాణం వద్దకు వెళ్ళిన బాబు బజ్జీలను వేయించి అందరినీ అశ్చర్యపరిచారు. కుతుకులూరు గ్రామంలోని ప్రశాంత్ విద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో బాబు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డిల విగ్రహాలను బాబు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పాదయాత్రలో బాబు వెంట టీడీపీ నేతలు నల్లమిల్లి మూలారెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మురళీమోహన్, నిమ్మకాయల చినరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.