March 27, 2013

స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చూపిస్తా

(విజయవాడ)  : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోనే తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో చూపిస్తానని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ నుంచి మంగళవారం ప్రకటన వెలువడిన నేపథ్యంలో చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన విజయవాడ - తూర్పు, మధ్య, పశ్చిమ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జీలతో కలిసి పని చేస్తానన్నారు. నగరంలోని 59 డివిజన్లు , జిల్లాలోని గ్రామాలు, మునిసిపాలిటీల పరిధిలో పార్టీని పటిష్ఠం చేయడానికి కార్యకర్తలు, నాయకుల సహకారం తీసుకుంటానన్నారు.

తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా కాలంలో అధిక ధరలు, విద్యుత్ సమస్యలు, అవినీతితో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకకు వెళ్ళిందని నాని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటుతానని కేశినేని నాని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ పని చేస్తానని తెలిపారు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశానుసారం కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ప్రజలకు మరింత దగ్గరతానన్నారు.