March 27, 2013

అర్బన్ టీడీపీ అధ్యక్షునిగా నాగుల్ మీరా

(విజయవాడ)  : తెలుగుదేశం అర్బన్ పార్టీకి కొత్త కృష్ణుడు వచ్చాడు. నూతన అధ్యక్షడుగా నాగుల్‌మీరాను నియమిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కేశినేని నాని పేరును ప్రకటించారు. వల్లభనేని వంశీ మోహన్‌కు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవి ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధిత్వాన్ని కేశినేని నానికి ఇవ్వాలని నిర్ణయించిన చంద్రబాబు ఆలోచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. కేశినేని నాని సిఫార్సుల మేరకు అర్బన్ అధ్యక్ష పదవిని నాగుల్ మీరాకు అప్పగించారు. ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది గడువు మాత్రమే ఉంది. అర్బన్ పార్టీకి ఇది ఎంతో కీలకమైన సమయం. అర్బన్ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సీపీఐకి, సెంట్రల్ సెగ్మెంట్‌ను సీపీఎంకు కేటాయించిన టీడీపీ తూర్పులో మాత్రమే పోటీ చేసింది.

ఈ మూడింటిలోనూ మిత్ర పక్షాలు ఓడిపోయాయి. అంతేగాక టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీమోహన్ గెలుపు అవకాశాలను కూడా అర్బన్ మింగేసింది. రూరల్ పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో వంశీ మోహన్‌కు 25 వేల ఆధిక్యత వచ్చి కూడా అర్బన్ పరిధిలో 37 వేల ఓట్ల మైనస్ రావడంతో వంశీ 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల తర్వాత వామపక్షాలు, టీడీపీల మధ్య భేదాభి ప్రాయాలు రావడంతో మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించింది. పశ్చిమ ఇన్‌చార్జిగా బుద్దా వెంకన్న, సెంట్రల్ ఇన్‌చార్జిగా బొండా ఉమామహేశ్వరరాఉ, తూర్పు ఇన్‌చార్జిగా గద్దె రామ్మోహన్ కొనసాగుతున్నారు. మూడేళ్లుగా నగరంలో మూడు పార్టీలు ఎవరి కార్య క్రమాలు వారు చేసుకుంటూ పార్టీలను బలోపేతం చేసుకుంటున్నారు.

టీడీపీ ఇన్‌చార్జిలు ముగ్గురుతో వంశీ సత్సంబంధాలు కొనసాగించారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వచ్చినా సర్దుకున్నారు. దుర్గాఘాట్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఆ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న జరిపిన పోరాటాన్ని చంద్రబాబు ప్రశంశించారు. పునాదులు లేని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేశావంటూ ఆయన కితాబు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. దాదాపుగా నియోజకవర్గ ఇన్‌చార్జిలకే అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే అవకాశాలుంటాయని పార్టీ నాయకుల ఊహ. వంశీ నేతృత్వంలో అర్బన్ పార్టీ పరిస్థితి కొంత వరకు మెరుగైందనే అభిప్రాయం అందిరిలో ఉంది. ఆర్థికంగా తనకున్న బలంతో యువతలో క్రేజ్ పెంచుకునేందుకు వంశీ తాపత్రయ పడ్డారు. ఈ దశలో వంశీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ వర్గీయులతో ఘర్షణ వాతావరణంలో పని చేశారు.

నడి రోడ్డు మీద జగన్‌తో చేతులు కలపడం వంశీ మీద మరక పడేలా చేసింది. ఆ తర్వాత వంశీ తప్పు ఒప్పుకుని చంద్రబాబును కలిశారు విభేదాలు సద్దుమణిగాయనుకుంటున్న తరుణంలో కేశినేని రంగ ప్రవేశంతో విజయవాడ టీడీపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. వంశీ బ్యాక్ టు పెవిలియన్ కేశినేని రాకతో వల్లభనేని వంశీమోహన్ ప్రాముఖ్యత పార్టీలో తగ్గింది. కేశినేని నాని సూచించిన నాగుల్‌మీరాకు అర్బన్ అధ్యక్ష పదవి ఇవ్వవలసి రావడంతో చంద్రబాబు వంశీని మండపేట పిలిపించుకుని మాట్లాడారు. వంశీని రాష్ట్ర పార్టీలోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన బాబు ఈ మేరకు ఆయనకు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవికి ఎంపిక చేశారు. పార్టీలో భవిష్యత్తుపై కూడా వంశీకి, బాబు భరోసా ఇచ్చారు.