March 27, 2013

ప్రజా చైతన్యానికే 'పల్లెపల్లెకు టీడీపీ'

నంగునూరు: ప్రజా చైతన్యానికే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట, సిద్దన్నపేట, కొండంరాజ్‌పల్లి, నర్మెట గ్రామా ల్లో మంగళవారం 'పల్లెపల్లెకు టీడీపీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. టీడీపీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్నారు.

ప్రజా సమస్యలను డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను చేపట్టారని, ఈ పాదయాత్రకు రాష్ట్రం లో అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. పాదయాత్ర సందర్భంగా పలు సమస్యలపై చంద్రబాబు స్పందిస్తున్నారని అన్నారు. మహిళలు, రైతులకు రుణాల మాఫీని ప్రకటించారని, అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటి సంతకం రుణమాఫీ ఫైనే ఉంటుందన్నారు.

టీడీపీకి పూర్వ వైభవం తథ్యమన్నారు. టీడీపీ నాయకులు కోమండ్ల రామచంద్రారెడ్డి, గుండు భూపేశ్, నర్ర జయపాల్‌రెడ్డి, ఉడుత మల్లేశం మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ధ్వజమెత్తారు. ప్రజలు విద్యుత్ కోత, నీటి ఎద్దడిలతో అల్లాడుతున్నా సర్కార్‌లో స్పందన లేదన్నారు. ప్రజల కష్టాలు చంద్రబాబు పాలనలోనే తీరుతాయన్నారు. మండల శాఖ అధ్యక్షుడు చెలికాని మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు ఎల్లంకి మహిపాల్, సత్యనారాయణరెడ్డి, రాజమౌళి, ధరవ్మరం బ్రహ్మం, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

పటిష్ఠంగా పార్టీ క్యాడర్ గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ పటిష్ఠంగా ఉందని మైనంపల్లి హన్మంతరావు చెప్పారు. నంగునూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అన్నారు. పార్టీలో అన్నీ అనుభవించిన వారే పార్టీని వీడారని పేర్కొన్నారు. నేతలు మారినా కార్యకర్తలు పార్టీ జెండాలను మోస్తున్నారని, పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను పార్టీ తప్పక గుర్తిస్తుందన్నారు.

రాజ్యాంగ సంక్షోభంతోనే తెలంగాణ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తేనే తెలంగాణ సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రాజకీయ పార్టీలు ఐక్యంగా తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. స్వార్థ రాజకీయాలను వీడి సమష్ఠి పోరాటం చేస్తేనే తెలంగాణ సాధ్యమన్నారు. పన్నెండున్నరేళ్లుగా తెలంగాణ కోసం ఓట్లు వేసినా రాలేదన్నారు. తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా లేఖను ఇచ్చి ఉద్యమిస్తోందన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో వివిధ పార్టీల నుంచి సుమారు 70 మంది టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాను కప్పి స్వాగతం పలికారు.

అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ : బాబుమోహన్ గుమ్మడిదల: వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, రైతుల రుణాలు మాఫీపైనే చంద్ర బాబు మొదటిసంతకం చేయనున్నా రని టీడీపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాబుమోహన్ పేర్కొన్నారు.

పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదలలో నిర్వహించిన బహిరంగ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతూ దాచుకోవడం..దోచుకోవడం పనిగా పెట్టుకుందని, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికలలో ఓటర్లు ఆలోచించి ఎవరు మంచి చేస్తున్నారనేది నిర్ణయించుకుని ఓటు వేయాలని కోరారు.