January 10, 2013

గిరిజన మహిళకు అరుదైన గౌరవం



ఓ సామాన్య గిరిజన మహిళకు అరుదైన గౌరవం దక్కింది. చంద్రబాబు పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల స్తూపాన్ని ఆవిష్కరించే అవకాశం ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గౌరారం గ్రామానికి చెందిన ఊకే నర్సమ్మకు దక్కింది. మాదిరిపురం వద్ద నిర్మించిన విజయస్తూపాన్ని చంద్రబాబు.. నర్సమ్మతో ఆవిష్కరింపజేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో టీడీపీ నిర్వహించిన సైకిల్‌యాత్రలో పాల్గొన్న నర్సమ్మ 600 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు.

దీంతో జిల్లా టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య తదితరులు నర్సమ్మను బాబుకు పరిచయం చేశారు. దీంతో వంద అడుగుల స్తూపాన్ని ఆమెతో ఆవిష్కరింపజేశారు. ఓ గిరిజన మహిళకు అరుదైన గౌరవమిచ్చిన ఘనత టీడీపీదేనని బాబు అన్నారు. టీడీపీ పేదల పార్టీ అని, బడుగు, బలహీనవర్గాల పార్టీ అని, ఈ విజయ స్తూపాన్ని పేదలకే అంకితమిస్తున్నామని ప్రకటించారు.