January 10, 2013

కరెంటు లేదు.. బిల్లెందుకు కట్టాలి?: చంద్రబాబు




అవినీతి సర్కారుపై తిరగబడండి
విద్యుత్ పాపం వైఎస్‌దే
బొగ్గు దిగుమతులో కిరణ్ రూ.400 కోట్లు మింగారు
ప్రజల కష్టాలను సర్కారు అసమర్థమే కారణం
ప్రజాభిమానం ఉంటే కొండలనైనా పిండీ చేస్తా
ఎంత దూరమైనా పాదయాత్ర చేస్తా
ఓటేసే రోజు నాకివ్వండి.. ఐదేళ్లు సేవచేస్తా
మాదిరిపురం బహిరంగ సభలో చంద్రబాబు

అవినీతి సర్కారుపై ప్రజలు, యువత.. బొబ్బలిపులులై, కొండవీటి సింహాలై తిరగబడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యుత్ సక్రమంగా లేనప్పుడు బిల్లులెందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు. ప్రజాభిమానం అండగా ఉన్నంత వరకు ఎంత దూరమైనా పాదయాత్ర సాగిస్తానని స్పష్టం చేశారు అన్నారు. 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

ప్రజాభిమానమే తనకు కొండంత బలాన్నిస్తోందని, దీనివల్లే హిందూపురం నుంచి ప్రారంభించిన పాదయాత్రను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించగలుగుతున్నానని చెప్పారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంతవరకు ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా పాదయాత్ర చేయగలనన్నారు. 1600 కిలోమీటర్ల పాదయాత్రలో దారిపొడవునా రైతులు, పేదల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, వీటన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని ప్రజలు గుర్తించాలని చెప్పారు.

తమ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి చెప్పినన్ని గంటలు నాణ్యమైన విద్యుత్ అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ దొంగలు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో విద్యుత్ వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం అంధకారంలో చిక్కుకుపోవడానికి అప్పటి సీఎం వైఎస్ కారణమని, వారి అవినీతి కారణంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని విమర్శించారు. రోశయ్య హయాంలోనూ అవినీతే తప్ప అభివృద్ధి మచ్చుకైనా కానరాలేదని చంద్రబాబు విమర్శించారు. సకల జనుల సమ్మె సమయంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసి రూ.400 కోట్లు మింగిన పాపం కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని ఆరోపించారు. కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు సరఫరానే సక్రమంగా లేనప్పుడు బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వం విద్యుత్‌పై శ్వేతపత్రం ప్రకటించాలని లేకపోతే తమ పార్టీనే నల్లపత్రం విడుదల చేస్తామని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికి 22సార్లు కేంద్రప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని, సామాన్యులు.. ఇక ద్విచక్రవాహనాలు పక్కనపెట్టి సైకిల్ ఎక్కాలని చమత్కరించారు.

సైకిల్‌తో ఆరోగ్యంతోపాటు ఖర్చు కూడా ఉండదని, అందుకే ఎన్టీఆర్ ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను ఎంచుకున్నారని గుర్తు చేశారు. నిత్యావసర ధరలు పెరిగిన తీరును కూడా చంద్రబాబు సభలో సోదాహరణంగా వివరించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో యువకిశోరాల్లా బొబ్బిలిపులులై, కొండవీటి సింహాలై ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నగదు బదిలీ ఇస్తుందని, పాలన గాడిలో పెడుతుందని, నిరుద్యోగులకు భృతి ఇస్తుందని హామీ ఇచ్చారు.

వైసీపీ, టీఆర్ఎస్‌పై నిప్పులు
వైసీపీ, టీఆర్ఎస్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంగా తన అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వైఎస్.. రూ.లక్షా 43వేల కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు ఆయన కుమారుడు ఈ దోపిడీని కొనసాగించేందుకు జైలు నుంచే పథక రచన చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పనికి రాని పార్టీ అని, ఆ పార్టీ వల్ల ఒరిగేదీమీలేదన్నారు.
మీ పెద్దకొడుకుగా ఉంటా

ఇంటికి పెద్దకొడుకు ఎలా ఆసరాగా ఉంటాడో..అలాగే తాను కూడా ప్రతీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి వారి కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఓటేసే ఒక్క రోజు తనకు కేటాయిస్తే ఐదేళ్లు సేవ చేస్తానని, ఇది ధర్మపోరాటమని దీనికి అందరూ కలిసి కట్టుగా సహకరిస్తే చరిత్ర తిరిగి రాద్దామని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో మాదిరిపురం గ్రామం పసుపురంగునద్దుకుంది.