January 10, 2013

విద్యుత్ పోరాటాలకు సిద్ధం కండి










తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంధకారంలో చిక్కుకు పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కరెంటు సరఫరా లేదని, విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందని, అస లు రాని కరెంటుకు బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. బుధవారం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ఏర్పాటు చేసిన విజయస్తూపం ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అవినీతి సర్కారుపై యువతరంతోపాటు రైతులు తిరగబడాలని చంద్రబాబు అన్నారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలను అభివృద్ధిలో ఎన్నో యేళ్లు వెనుక్కు తీసుకెళ్లిందని , ఏ రంగంలో చూసినా అవినీతి తప్ప అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదన్నారు. 'మీ అభిమానమే నాకు కొండంత బలం. ఎన్ని కష్టాలెదురైనా ప్రజాభిమానమే నన్ను ముందుకు నడుపుతోందని, ప్రజలు అండగా ఉన్నంతవరకు ఎంత దూరమైనా పాదయాత్ర కొనసాగిస్తాన' ని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ పరిపాలన మొత్తం అవినీతిమయమని, రూ.లక్షన్నర కోట్లు దోచుకున్నారని, ప్రస్తుతం ప్రజలు పడుతున్న విద్యుత్ కష్టాలకూ వైఎస్ అనాలోచిత చర్యలే కారణమని ఆరోపించారు. కరెంటు కావాలంటే ఉత్పత్తిని పెంచాలని, కానీ అవినీతి పెరిగిపోయిందని, కాంగ్రెస్ దొంగల వల్ల విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు. రోశయ్య, కిరణ్‌లు కూడా విద్యుత్ సమస్యను పట్టించుకోవడం లేదని, అందువల్లే అంధకారం దాపురించిందన్నారు. విద్యుత్తు సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయకపోతే ప్రభుత్వంపై తాము బ్లాక్‌పేపర్ విడుదల చేసి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, నిత్యావసరాలు ఇలా అన్నింటి ధరలు పెంచుతూపోతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో 22 సార్లు ఇంధన ధరలు పెంచారని, ఇక.. సామాన్యులు మోటార్‌సైకిళ్లు పక్కనపెట్టి సైకిల్ ఎక్కాలని సూచించారు. నిత్యావసర ధరలు పెరిగాయని చెబుతూ తెలుగుదేశం హయంలో ఉన్న ధరలను వివరించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు జైలు నుంచే రాజకీయాలు సాగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో గనులన్నీ దోచుకున్నారని, బయ్యారం గనులను దొడ్డిదారిన అల్లుడికి కట్టబెట్టారని, లక్షా 46 వేల ఎకరాల విస్తీర్ణంలోని గనులను అడ్డగోలుగా అస్మదీయులకు పందేరం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో టీడీపీ చేసిన పోరాటాల ఫలితంగానే గనులు తిరిగి ప్రజల పరమయ్యాయని గుర్తుచేశారు. జగన్ ఆస్తులు స్వాధీనం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

టీ ఆర్ ఎస్ పనికిరాని పార్టీ : టీఆర్ఎస్ పనికిరాని పార్టీ అని ఆ పార్టీ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఆరు నెలలు ఫామ్‌హౌస్‌లో పడుకుని టీడీపీపై విమర్శలు చేయడం ఆ పార్టీకే చెల్లిందన్నారు. రాష్ట్ర విభజన విషయమై తమ వైఖరేమిటో స్పష్టం చేసిన తరువాత కూడా ఇంకా ఆ పార్టీ నేతలు కావాలనే తమపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీలోని మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం చేసేందుకు టీడీపీ పార్టీ కట్టుబడి ఉందని, వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసేది లేదని మరోసారి స్పష్టం చేశారు. గతంలో వర్గీకరణ అమలు చేసి రిజర్వేషన్ల్లు కల్పించామని గుర్తుచేశారు.

పవిత్ర ప్రయాణం, ధర్మపోరాటం : టీడీపీ పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన వస్తున్నా.. మీకోసం యాత్రను పవిత్ర ప్రయాణం, ధర్మపోరాటంగా చంద్రబాబు అభివర్ణించారు. అంతా కలిసికట్టుగా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తిచేశారు. రైతులకు రుణమాఫీ, బీసీ డిక్లరేషన్, 100 సీట్ల కేటాయింపు, గిరిజన తండాలకు పంచాయతీల గుర్తింపు, బంజారాలకు ఐటీడీఏ ఏర్పా టు వంటి హామీలిచ్చారు. ఈసభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, స్వర్ణకుమారి, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావుతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ నేతలు పాల్గొన్నారు