January 10, 2013

నా జీవితంలో ప్రత్యేకమైన రోజు



ఈరోజు నా జీవితంలోనే ప్రత్యేకమైనది. నా రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు! హిందూపురంలో మొదలైన నా పాదయాత్ర 1600 కిలోమీటర్లు దాటి 100 రోజుల మైలురాయిని చేరుకుంది! నాడు ఎన్టీఆర్ ఇదే రోజున తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించారు. కాకతాళీయమే అయినా.. నిజామాబాద్ జాడీ జమాల్‌పూర్‌లో 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ బస చేసిన ప్రాంతంలోనే.. అదే తేదీన నేనూ బస చేయడం.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజునే వంద రోజుల మైలురాయిని చేరుకోవడం సంతృప్తినిచ్చింది. ఇలాంటివన్నీ సెంటిమెంట్ పరంగా నాకూ, మా పార్టీ శ్రేణులకూ ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. ఈ వంద రోజుల్లో వేలగ్రామాల్లో లక్షల మంది గుండె చప్పుళ్లు విన్నాను. పేదల బతుకులు ఎలా చితికిపోయాయో కళ్లారా చూశాను. దిక్కుతోచని స్థితిలో ఉన్న జనానికి నేను పెద్ద దిక్కుగా ఉంటానన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను.

పోరాటాలకు నెలవైన ఖమ్మం జిల్లాలో.. నా పాదయాత్ర వందో రోజున అడుగుపెట్టాను. ఈ ప్రస్థానంలో వ్యక్తిగతంగా ఎన్నో కష్టనష్టాలు వచ్చినా ఉదాత్త ఆశయంతో మొదలైన నా యాత్ర నిర్విఘ్నంగా కొనసాగించాలని పట్టుదలతో ముందుకు కదిలాను. నా యాత్ర విజయవంతంగా సాగడం వెనుక ఎందరో వ్యక్తుల కృషి ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన తరుణమిది. ఈ 100 రోజుల యాత్ర ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుతా. మరికొన్ని లక్షల మంది ప్రజలను కలుస్తా. వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారిలో ఒకడిగా ముందుకు అడుగు వేస్తా!!

నోట్: చంద్రబాబు 2012, అక్టోబర్ 2న పాదయాత్ర ప్రారంభించారు. నాటి నుంచి బుధవారానికి సరిగ్గా 100 రోజులు పూర్తయ్యాయి. ఇందులో బాబు విశ్రాంతి తీసుకున్న రోజులు, ఎర్రన్నాయుడు హఠాన్మరణం నేపథ్యంలో పరామర్శకు వెళ్లిన రోజులూ ఉన్నాయి.