January 10, 2013

రైతులు తిరగబడి హక్కుల్ని సాధించుకోవాలి

రాష్ట్రంలో పనికిమాలిన ప్రభుత్వం
ఉద్యమిస్తున్నవారిని జైల్లో పెడుతున్న ప్రభుత్వం : చంద్రబాబు

రాష్ట్రంలో పనికిమాలిన, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులు తిరగబడి హక్కులను కాపాడుకోవాలని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులు పూర్తిగా తిరుగుబాటు చేస్తేగానీ మన హక్కుల్ని కాపాడుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు.

'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఉద్యమం చేస్తున్న టీడీపీ నేతలను ఈ ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లకు పంపుతోందని, ఇప్పటి వరకు 200 టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని ఆయన విరుచుకుపడ్డారు. నగదు బదిలీ పథకం..నకిలీ బదిలీ పథకంగా మారిపోయిందని విమర్శించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం దోపిడీదారులను కాపాడుకునేందుకే పరిమితం అయ్యిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బోధకాలు వ్యాధితో బాధపడేవారికి రూ. 1500 పింఛన్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఖమ్మం జిల్లాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర రెండోరోజు కొనసాగుతోంది.