January 10, 2013

చార్జీలు తగ్గిస్తారా.. ఇంటికి వెళతారా?




విద్యుత్ పెంపుపై సర్కారుకు టీడీపీ అల్టిమేటం
దశలవారీ ఆందోళనకు రాష్ట్రస్థాయి భేటీలో చంద్రబాబు పిలుపు

 ఎడాపెడా చార్జీలు పెంచుతున్న కాంగ్రెస్ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తారో.. లేక ప్రజాగ్రహానికి గురై ఇంటికి పోతారో తేల్చుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో గురువారం జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృతస్థాయి సమావేశం.. కరెంట్ చార్జీలపై పోరాడాలని నిర్ణయం తీసుకుంది.

ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ చార్జీల భారంపై రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీని ప్రకారం ఈ నెల 21న రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహిస్తారు. 25వ తేదీన విద్యుత్ ఏడీఈ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు జరుగుతాయి.

ఫిబ్రవరి 4న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ స్థాయి పికెటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారం రూ.31వేల కోట్లు ఉందని చంద్రబాబు మండిపడ్డారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోను ఇంత భారం మోపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. "చార్జీలు పెంచాల్సిన అవసరం లేకుండా విద్యుత్ వ్యవస్థను సంపూర్ణంగా సంస్కరించి మిగులు కరెంట్‌తో వారికి అప్పగించాను. అయితే తొమ్మిదేళ్లలోమొత్తం నాశనం చేశారు'' అని ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి వచ్చిన సమస్యలన్నీ ఇప్పడు కొత్తగా వచ్చినవి కావని, వైఎస్ హయాం నుంచి మొదలైన పతనం ఇప్పడు పరాకాష్టకు చేరిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆరునెలలుగా తెలంగాణలో టీఆర్ఎస్ విశ్వసనీయత కోల్పోయిందని, తన పాదయాత్రను అడ్డుకోవాలని రక రకాలుగా ప్రయత్నించి విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనకు సంతాప సూచకంగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.

ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నందమూరి హరికృష్ణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దాడి వీరభద్రరావు, కేఈ కృష్ణమూర్తి, కడియం శ్రీహరి, ఉమా మాధవరెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాగా.. బాబు పాదయాత్ర 100 రోజుల మైలురాయి చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు గురువారం అభినందన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి..

పని చేయకపోతే టికెట్లు లేవు!
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వరంలో కాఠిన్యం పెంచారు. ఈ ఏడాదిలో మంచి పనితీరు చూపించిన వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని, పనిచేయకపోతే టికెట్లు లేవని తేల్చి చెప్పారు. ఈమేరకు మాదిరిపురంలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులను పరోక్షంగా హెచ్చరించారు. ఇంట్లో కూర్చుంటే ఎవ్వరూ గెలవరని, అందుకే పనిచేసే వారికే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు.