January 21, 2013

అన్ని వనరులు, హంగులు ఉన్నా వికలాంగ జిల్లాగా మార్చారు

'అటు నీటి వనరులు, ఇటు సహజ వనరులు... శ్రమించే ప్రజలు... ఇలా అన్ని వనరులూ, హంగులూ నల్లగొండ జిల్లా సొంతం. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాను... వికలాంగ జిల్లాగా మార్చారు' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర నాలుగోరోజు, ఆదివారం కోదాడ మండలం కాపుగల్లు క్రాస్‌రోడ్, పాత,చిన్న గుడిబండ, కాపుగల్లు, రెడ్లకుంటతండాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన పలు సభల్లో ప్రసంగించారు. రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు కాపుగల్లుగ్రామానికి వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

స్థానిక నాయకుడు తొండపు భాస్కర్‌రావు సహకారంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా సురక్షితమైన నీటిని తెలుగుదేశం అందిస్తోందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో... సాగర్ ప్రాజెక్టులో 490 అడుగుల మేర నీళ్లు ఉన్నా కిందికి వదిలామని, ప్రస్తుతం 520 అడుగులు ఉన్నా ఆందోళనలు చేస్తే తప్ప నీళ్లు వదిలే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 22 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వైఎస్ కాలంలోనే 14.798 మంది అన్నదాతలు బలవన్మరణాల పాలయ్యారని ఆవేదన చెందారు. వీరేకాదు వృత్తికి ప్రోత్సాహం లేక చేనేతలు, అవమానాలు తాళలేక మహిళలు, ఉద్యోగ అవకాశాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ పాలన తీరును వివరించారు.

తాము అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర కాదు... గిట్టుబాటు ధర కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2014 వరకు కరెంట్ చార్జీలు పెంచనని చెప్పి ఓట్లు వేయించుకున్న పెద్ద మనిషి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. 'తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా.రెండు మార్లు ప్రతిపక్షనేతగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి పదవికోసం పాదయాత్ర చేపట్టలేదు. ఆ పదవి నాకు కొత్త కాదు. ప్రజలు కష్టాలు పడుతున్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. వారిని కలిసి సమస్యలు తెలుసుకుని అండగా ఉంటానని ధైర్యం చెప్పడానికే పాదయాత్ర చేపట్టా' అని వివరించారు.

విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు వస్తున్నా... మీకోసం పాదయాత్రకు జిల్లా ప్రజలు చక్కగా స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. కొన్ని కారణాల వల్ల జిల్లా మొత్తం పర్యటించలేకపోయా. మళ్లీ ఒకసారి తప్పకుండా జిల్లాకు వస్తాను' అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

నేటితో ముగియనున్న పాదయాత్ర... 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా చంద్రబాబు ఈనెల 16న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మీదుగా కోదాడ మండలం శాంతినగర్‌లో అడుగుపెట్టారు. 16నుంచి 21 వరకు అయిదు రోజుల పాటు సుమారు 50.5 కి.మీల మేర కోదాడ, చిలుకూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పాదయాత్ర క్రమంలో వివిధ వర్గాల ప్రజలతో ఆయన నేరుగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారిస్తామని హామీలు ఇచ్చారు. పలుచోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.

తాము అధికారంలోకివస్తే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులతో మమేకమై, అవినీతిపై పోరాడాల్సిన తక్షణావసరాన్ని వారికి నొక్కిచెప్పారు. పార్టీనేతలతో సమావేశాలు జరిపి వారికి దిశానిర్దేశం చేశారు. ఇక వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాబుకు విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. సోమవారంతో తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర ముగుస్తుండడంతో ఈ ప్రాంతానికి చెందిన కీలక నేతలు అంతా కోదాడ చేరుకున్నారు.

నేడు జిల్లా కార్యవర్గ సమావేశం పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం... రిక్విన్ పరిశ్రమ సమీపంలో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. పాదయాత్రపై సమీక్ష, భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాయకులు వ్యవహరించాల్సిన తీరుపైన చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.