January 21, 2013

గరికపాడులో ఘన స్వాగతం

 వస్తున్నా మీకోసం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర నల్లగొండ జిల్లా నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లాలో ప్రవేశించింది. జిల్లా సరిహద్దు గరికపాడు పాలేటి వంతెన వద్ద చంద్రబాబుకు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీగా వచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎంఎల్ఏలు శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకరరావు, దాసరి బాలవర్ధనరావు, జయమంగళ వెంకట రమణ, ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రులు నెట్టెం రఘురామ్, కోడెల శివప్రసాదరావు, ఎంఎల్‌సీలు వైబీ రాజేంద్ర ప్రసాద్, చిగురుపాటి వరప్రసాద్, నన్నపనేని రాజకుమారి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, వర్ల రామయ్య, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్, కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, కోమటి సుధాకర్, నల్లగట్ల స్వామిదాస్, నల్లగట్ల సుధారాణి, రావి వెంకటేశ్వరరావు, చలసాని ఆంజనేయులు, కొల్లు రవీంద్ర, ఆచంట సునీత తదితరులు స్వాగతం పలికారు.

జగ్గయ్యపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గింజుపల్లి రమేష్, చంద్రబాబుకు నాగలి బహుకరించారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ముగించి, జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబుకు తెలంగాణా టీడీపీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. పార్టీ తెలంగాణా ఎంఎల్ఏల ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు, ఎంఎల్ఏలు మోత్కుపల్లి నరసింహులు, ఉమా మాధవరెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు తదితరులు చంద్రబాబుకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణాలో పాదయాత్రను విజయవంతం చేశామని, ఏలాంటి మచ్చ పడకుండ చంద్రుడిలా తెలంగాణా నుంచి బాబును ఆంధ్రాకు పంపించామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.