January 21, 2013

చంద్రబాబు పాదయాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లు

కౌంట్ డౌన్ మొదలైంది. గరికపాడు చెక్‌పోస్టు దగ్గర బాబుకు ఘన స్వాగతం పలకటానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. లక్షమంది కార్యకర్తల గర్జన మధ్య బాబు జిల్లాలోకి అడుగు పెట్టే క్షణం కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆశతో ఎదురుచూస్తున్నాడు. సంక్లిష్ట రాజకీయాల నడుమ.. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు 63 ఏళ్ళ వయసులో చంద్రబాబు పాదయాత్రతో జిల్లాలోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్రస్థాయి నాయకులెవ్వరూ ఇప్పటి వరకు జిల్లాలో పాదయాత్ర తలపెట్టలేదు. జిల్లాలోకి అడుగు పెడుతున్న ఈ బాటసారికి ఘన స్వాగతం పలికేందుకు నాయకులు సిద్ధమయ్యారు. బాబు తొమ్మిది రోజుల పర్యటనను దిగ్విజయం చేయటానికి సర్వం సిద్ధం చేశారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలోని సమస్యలు ఒక్కటీ పరిష్కారం కాకపోవటాన్ని ప్రజల్లో చంద్రబాబు ఎత్తిచూపేలా చంద్రయాన్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ పశ్చిమం, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలలో పాదయాత్ర జరిపే చంద్రబాబు మొత్తం 19 చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడతారు.

రూరల్ నియోజకవర్గాలలో రైతాంగ సమస్యలపైన, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉత్పన్నమైన సమస్యలపైన బాబు ప్రధానంగా ప్రసంగించనున్నారు. రైతుల ఆత్మహత్యలు, విత్తనాల సబ్సిడీ కుదింపు, ఎరువుల ధరల స్థిరీకరణ లేకపోవటం, గిట్టుబాటు ధరలు, అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులు, సరైన విధానం లేని ప్రభుత్వ దమన నీతిని బాబు ఎండగట్టనున్నారు.

పోలవరం, పులిచింతల, ఆశల ఊగిసలాటలో ఉన్న బందరు పోర్టుల దీన స్థితిపై బాబు మాట్లాడతారు. ప్రణాళికలేని ప్రజా ప్రతినిధుల నిర్వాకాలను ఎండగట్టనున్నారు. కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లై ఓవర్ ఏర్పాటు, విజయవాడలో సూపర్ స్పెషాలిటీఏర్పాటు, గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై పాలకులు ఇచ్చిన హామీలను ఎత్తి చూపుతారు. రచ్చబండలో ప్రజల అర్జీలపై దృష్టి సారించని ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. మొత్తంగా అటు రాష్ట్ర పరిస్థితిని, స్థానిక పరిస్థితిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళి, మళ్లీ రాష్ట్రాన్ని పాలించే అవకాశం తమకు కల్పించాలని విజ్ఞాపన చేయనున్నారు.