January 21, 2013

ఉత్కంథభరిత వాతావరణం

జిల్లాలో జగ్గయ్యపేట ప్రాంతంలో ఒక విధమైన ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. తెలంగాణా సెగ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లలో తలమునకలై ఉన్న టీడీపీ శ్రేణులు... నిరసన తెలియజేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు... గరికపాడు రావాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఫోన్లు... పోలీసుల మోహరింపు... మొత్తంగా అన్ని వర్గాలలో కూడా ఒకటే ఉత్కంఠ... ఏం జరుగుతుందన్న విషయమై తర్జన భర్జనలు...వస్తున్నా... మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం జిల్లాలో ప్రవేశించనున్నారు. .

నల్లగొండ జిల్లా రామాపురం మీదుగా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద మధ్యాహ్న సమయంలో ఆయన జిల్లాలో అడుగుపెడతారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీకి చెందిన జిల్లా నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లక్ష మందితో అపూర్వ స్వాగతం పలుకుతామని నాయకులు ప్రకటించారు. గ్రామాల్లో ప్రచారం చేయటమే కాకుండా కార్యకర్తల తరలింపు బాధ్యతలను గ్రామ స్థాయి నాయకులకు అప్పగించారు. బ్యానర్లు, ప్లెక్సీలతో పాటుగా గరికపాడు వద్ద స్వాగతం ద్వారం ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట అడ్డరోడ్డు వద్ద జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు

తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు లెటరు ఇచ్చినందున పాదయాత్రకు నిరసన తెలియజేస్తామని ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరిస్తున్నారు. నిరసనకు భారీగా తరలిరావల్సిందిగా కోరుతూ, విజయవాడ నుంచి స్థానిక నాయకులకు ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు తొలుత గరికపాడు వద్ద ప్రత్యేకంగా టెంట్ వేశారు. తర్వాత దానిని తొలగించి అనుమంచిపల్లి వద్ద రోడ్డు పక్కన వేశారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకుల హెచ్చరికలు, మరోవైపు తెలంగాణా సెగ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండ చూసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.

నందిగామ డీఎస్పీ చిన్నహుస్సేన్ జగ్గయ్యపేటలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదనపు బలగాలను రప్పించారు. ఇప్పటికే గరికపాడు చెక్‌పోస్టు ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామన్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్నామని, అనుమానితులు,వాహనాలను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.