January 21, 2013

గాలికీ, జుట్టుకూ పన్ను వేస్తారేమో

జనం చింతల్లో.. వాళ్లు సంబరాల్లో!
రాహుల్ కోసం ఇంత ప్రయాసా?
కాంగ్రెస్ 'చింతన్ శిబిర్'పై చంద్రబాబు ధ్వజం
ఉల్లిని కోయకుండానే కన్నీళ్లు

  పెరిగిన ధరలతో, విద్యుత్ కోతలతో, రైతు ఆత్మహత్యలతో ప్రజలంతా చింతల్లో ఉండగా, కాంగ్రెస్ మాత్రం 'చింతన్ శిబిర్' పేరిట సంబరాలు జరుపుకుంటోందని తె లుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ జైపూర్ సమావేశాల తీరు.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాహుల్‌కు ఉపాధ్యక్ష పద వి కట్టబెట్టడానికి అంత ప్రయాస, ఆడంబరం దేనికని, ఢిల్లీలో కూర్చుని ప్రకటిస్తే సరిపోదా అని ప్రశ్నించారు.

నల్లగొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ వద్ద చంద్రబాబు ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. కాపుగల్లు, రెడ్లకుంట మీదుగా 14.8 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పలు సభల్లో ఆయన మాట్లాడారు. "అప్పులపాలైన వేలాది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. విద్యుత్ కోతతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఉపాధి కోల్పోయి లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇలా ప్రజలంతా చింతల్లో ఉంటే కాంగ్రెస్.. సంబరాల్లో మునిగి తేలుతోంది'' అని దుయ్యబట్టారు.

సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లొస్తాయని, కానీ పెరిగిన ధరలతో ఆడబిడ్డలకు ఉల్లిని కోయకముందే కన్నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు తమ హయాంలో మహారాష్ట్ర నుంచి నిపుణులను పిలిపించి ప్రత్యేకంగా గోదాములు నిర్మించామని గుర్తుచేశారు. ఆ గోదాములను ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

కాగా, కోదాడ మండలం గుడిబండలో బహిరంగసభ జరుగుతుండగా ఓ విద్యార్థి 'జై తెలంగాణ' అని ఒక్కపెట్టున నినదించాడు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. "నోరు తెరిస్తే పేగులు లెక్కవేసే మనిషిని. మా మీటింగ్ బాగా జరుగుతుంటే చూసి భయపడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు చిన్నచిన్న గొడవలు చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్లు గొడవ చేస్తే ఎలా నోరు మూయించాలో మా వాళ్లకు తెలుసు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్.. ఇలా అన్ని జిల్లాలూ తిరిగా'' అని తీవ్రస్వరంతో అన్నారు.

తెలంగాణ విషయంలో తమ వైఖరి అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా చెప్పామని, అయినా అల్లరి చేస్తే ఏం చెప్పాలి తమ్ముళ్లూ...! అంటూ సభలోని యువకులను ఉద్దేశించి ప్రశ్నించారు. "వాళ్లు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నేను ప్రజల జీవితాలకు ప్రాధాన్యం ఇస్తా''నని చంద్రబాబు తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కాలం చెల్లిన నాణేలుగా అభివర్ణించారు.

"కాంగ్రెస్ నావకు చిల్లులు పడ్డాయి. మునిగేందుకు సిద్ధంగా ఉంది. వాళ్లు మునిగినా ఫరవాలేదు. కానీ దేశాన్ని ముంచే పరిస్థితి ఉంది. అంతా మేల్కొనాలి' అని పిలుపునిచ్చారు. సీఎం కిరికిరి రెడ్డి అని, అన్నీ తెలిసిన వాడిలా ఫోజుకొడుతుంటాడని మండిపడ్డారు. కరెంట్ డిపార్ట్‌మెంట్‌కు మంత్రే లేడంటే రాష్ట్రంలో ఏ తరహా పాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. సీఎం కిరణ్ అర్థం చేసుకునేలోపు ఆయన సీటు పోయే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

నీలం తుపాను సహాయానికి రూ. 50 కోట్లు అడిగితే మూడు కోట్లు ఇచ్చారని, 30 మంది కాంగ్రెస్ దద్దమ్మ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే తెలుగుదేశం హయాంలో వాజపేయిపై ఒత్తిడి చేసి కరువు సహాయం కింద 54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకంలో రాష్ట్ర ప్రజలకు పంచామన్నారు. "కాంగ్రెస్ హయాంలో ఆస్తిపన్ను, నీటి పన్ను..అన్నీ పెంచారు. గాలి పీలుస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి పన్నులు వేసే అవకాశం రాబోయే రోజుల్లో లేకపోలేదు. మేం ఇన్ని కష్టాలు పెట్టినా మీ జుట్టు రాలిపోలేదు కాబట్టి జుట్టు పన్ను వేస్తున్నాం'' అని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

ఆడబిడ్డలకు బంగారం దొరికే పరిస్థితి లేదని, బంగారం అంతా గాలి జనార్దనరెడ్డి ఇంట్లోనే ఉందన్నారు. "గాలి తన పెద్దకొడుకు అని వైఎస్ చెప్పారు. ఆయనకు బంగారు సింహాసనాలు, మంచాలు దోచిపెట్టారు. చిన్న కొడుకు జగన్‌కు లక్ష కోట్లు అక్రమంగా సంపాదించి పెట్టాడు'' అని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెడతానని ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ మండలం కాపుగల్లులో నిర్మించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు.