January 21, 2013

ఈ ఎడబాటు తాత్కాలికమే!

తెలంగాణ జిల్లాల్లో అపూర్వ ఆదరణ లభించింది. పుట్టెడు కష్టాల్లో ఉండి కూడా జనం నీరాజనం పలికారు. చింతల్లో ఉన్న వాళ్ల చెంతకు పాదయాత్రగా వెళ్లినందుకు, భవిష్యత్తుపై కొంతైనా భరోసా ఇవ్వగలిగానన్న సంతృప్తి మిగిలింది. రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యార్థి, మహిళ, వృద్ధులు.. ఇలా ఎవరిని కదిలించినా అసంతృప్తి, ఆవేదనలే ముందుగా పలకరించాయి. తెలంగాణలో ఒక్కో జిల్లాది ఒక్కో వ్యథ. అలాగే.. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన అనుభవాన్ని నేను చవిచూశాను. మహబూబ్‌నగర్‌లో వేదిక కూలి నడుంకు దెబ్బ తగిలినా సంకల్పం చెదరలేదు.

ఆత్మీయుడు, కుడిభుజంగా ఉన్న ఎర్రన్నాయుడు మృతి కుంగదీసింది. రంగారెడ్డి తండాల్లో కష్టాలను స్వయంగా చూసినవాడిగా గిరిజన డిక్లరేషన్ రూపొందించాను. నిజామాబాద్ జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటాను. జాడీజమాల్‌పూర్ గ్రామంలో అడుగుపెట్టినప్పుడు, 30ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఎన్టీఆర్ గడిపిన స్మృతులు భావోద్వేగానికి గురిచేశాయి. ఖమ్మంలో యాత్రకు వందో రోజు పూర్తయిన ఘడియలు మరిచిపోలేను. నల్లగొండకు వచ్చేసరికి, ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య మరోవైపు ఎండిపోయిన పంటలుచూసి ఆవేదన కలిగింది. కరీంనగర్‌లో చేనేతల కష్టాలూ, గల్ఫ్ బాధితుల గోడూ విన్నాను.

రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రధాన నదులన్నీ తెలంగాణను పలకరించాల్సిందే. కానీ, ఈ ప్రాంతానికి శిలాఫలకాలు తప్ప జలభాగ్యం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒకటి, ఆదిలాబాద్‌లో మరో శిలాఫలకం తప్ప మార్గమధ్యంలో ఎక్కడా 'ప్రాణహిత-చేవేళ్ల' ఆనవాలే కనిపించలేదు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో అడుగుపెట్టగానే ఆ సరస్వతీ నిలయాన్ని ప్రముఖ విద్యాకేంద్రంగా మార్చాలన్న ఆలోచన మధ్యలోనే ఆగిపోవడంపై మనసు చివుక్కుమంది.

మండల కేంద్రాల్లో సాధ్యమైనంత మేర అవినీతిపై ప్రజల్లో చర్చ పెట్టాను. 'అవినీతిపై యుద్ధం చేయాల్సిన సైనికులు మీరే'నంటూ యువకులను ఉత్సాహపరిచాను. ఎమ్మార్పీఎస్, లంబాడా హక్కుల సమితి.. యాత్ర ఆసాంతం రక్షణగా నిలవడం, కుల సంఘాల తోడ్పాటు మరవలేను. ఇప్పటికి వీడ్కోలు పలుకుతున్నా.. తెలంగాణ నుంచి ఈ ఎడబాటు తాత్కాలికమే!