January 21, 2013

ప్రియనేతకు జన దీవెన

 జిల్లాలో అడుగుపెడుతున్న చంద్రబాబుకు సమైక్యాంధ్రపై కనువిప్పు కలిగిస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన సవాళ్ళు గాలికి కొట్టుకు పోయాయి. బాటసారి చంద్రబాబుకు తెలంగాణ జిల్లాల కంటే మిన్నగా.. అశేష ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. దిక్కులు పిక్కటిల్లేలా ప్రజల జయజయధ్వానాలు, కేరింతల నడుమ చంద్రబాబు పాదయాత్ర తొలి రోజు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. చంద్రబాబు పార్టీకి ఏ విధంగా పూర్వవైభవం కల్పించాలని కలలు కన్నారో.. ఆ సన్నివేశం సోమవారం పాదయాత్రలో కనిపించింది. జిల్లాలోని దారులన్నీ.. జగ్గయ్యపేటవైపుకే దారి తీశాయి. జన సంద్రంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. స్వచ్ఛందంగా పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూసి, టీడీపీ అధినాయకుడే మహదానందపడిపోయారు. జాతీయ రహదారిపై పసుపు సైన్యం కవాతు చేసింది. పాదయాత్ర ఆద్యంతం నిండైన జనాభిమానం మధ్య సాగింది.

జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రకు స్పందన వస్తుందని ఊహించని బాబు ఈ పరిణామంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. షేర్‌మహ్మద్‌పేటలో గడపగడప నుంచి తరలి వచ్చిన ప్రజానీకానికి బాబు ముగ్ధుడైపోయారు. జగ్గయ్యపేట క్రాస్ రోడ్డు దగ్గర అశేష జనవాహిని తరలి రావటంతో బహిరంగ సభలో దాదాపు గంటపాటు ఆవేశంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో ప్రజలు చవిచూస్తున్న విద్యుత్తు, నిత్యావసరాల ధరలు, బెల్టు షాపులపై ప్రభుత్వ దమన నీతిపై విరుచుకు పడ్డారు. కాం గ్రెస్ (ఐ), కాంగ్రెస్ (వై)లు ఏనాటికైనా కలిసిపోయేవని, వారి మాయమాటలకు, ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల ఒక్కరోజు సమయం తనకు కేటాయిస్తే.. ఐదేళ్లు సేవకుడిలా పనిచేస్తానని, ప్రతి కుటుంబానికి ఓ పెద్ద కొడుకులా తాను నిలబడతానని వాగ్దానం చేశారు.