December 13, 2012

చిరుత అడవిలో బాబు బస

చిరుత సంచారంపై స్థానికుల సమాచారం
బాబు బస వద్ద పోలీసులు అప్రమత్తం

ఖానాపూర్, డిసెంబర్ 13: అది... కాకులు దూరని కారడివి కాదు! కానీ... చిరుతలు తిరిగే చిట్టడివి! అక్కడే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాత్రి బస! దీంతో... భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ సమీపంలో చంద్రబాబు బస చేశారు. పార్టీ నేతలు చంద్రబాబు కోసం, ఇతర నేతల కోసం గుడారాలు ఏర్పాటు చేశారు.

రాత్రి 10.30 గంటల సమయానికి చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. అక్కడ గుడారాలు వేస్తున్న సమయంలోనే స్థానికులు పార్టీ శ్రేణులను, పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతంలో చిరుత పులి తిరుగుతోందని చెప్పారు. రాత్రి వేళల్లో పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తాగేందుకు వస్తుందని తెలిపారు.

పెంబి అటవీ ప్రాంతంలోని వేణునగర్ సమీపంలో మూడు నెలల క్రితం ఒక చిరుత పులి రెండు మేకలు, ఒక ఆవును చంపిందని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు బస చేసిన చోటు ఈ అడవికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా... జనావాసాలకు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో గుడారాలు వేశారు. అసలే ఇది తీవ్రవాద ప్రభావిత ప్రాంతం కావడం, ఆపై చిరుత సంచారంపై సమాచారం రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.