December 13, 2012

టీఆర్ఎస్‌తో ప్రజలకు ప్రయోజనం లేదు

నిర్మల్/నిర్మల్అర్బన్/సారంగాపూర్/లక్ష్మణచాంద/మామడ/ఖానాపూర్: టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు చేసిందేమి లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అ న్నారు. బుధవారం రాత్రి లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామంలో పాదయాత్ర నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ పార్టీ నాయకులు తోడు దొంగలని, వారు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి పందికొక్కు ల్లా బలిశారన్నారు. జగన్‌పై కేసుల మాఫీ కోసం కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్‌సీపీ విలీనమవడం ఖాయమన్నారు.

టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు ఫాంహౌజ్‌లో కుంభకర్ణుడిలా ని ద్రపోతున్నాడే తప్ప తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, గతంలో లేఖను సైతం సమర్పించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ కోసం నాన్చుడు ధోరణి అవలంభించడంతో పాటు తెలుగుదేశం పార్టీపై లేనిపోని అభాండాలు మోపుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన అవినీతిలో తన తనయుడు వైయస్.జగన్ అవినీతికి పాల్పడి జైలు జీవితం గడుపుతున్నాడన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతీ విద్యార్థికి తమ పార్టీ అధికారంలోకి వస్తే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని అన్నారు. ఎస్సారెస్పీ ముంపు బాధితులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మె ల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ రాథోడ్ రమేష్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గెడం నగేష్, లోలం శ్యామ్‌సుందర్, అబ్దుల్‌కలాం, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బాబర్, రాష్ట్ర రైతు కార్యదర్శి కొరిపెల్లి భూషణ్‌రెడ్డి, నిర్మల్ పట్టణ, మండల అధ్యక్షులు గండ్రత్ రమేష్, ఆదుముల్ల గంగన్న తదితరులు ఉన్నారు.

బాలికలకు ఉద్యోగం వచ్చే వరకు చదివిస్తాం: బాలికలకు ఉద్యోగం వచ్చేంత వర కు పూర్తిగా ఉచితంగా చదివిస్తానని టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. పాదయాత్రలో భాగంగా బుధవారం వెల్మల్‌లో జరిగి న బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బుధవారం నిర్మల్ మండలం మూఠాపూర్ నుండి 1.10 నిమిషాలకు బయలుదేరిన ఆయన సాయంత్రం 3 గంటలకు వెల్మల్‌బొప్పారం గ్రామాన్ని చేరుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీసీలకు వందసీట్లు కేటాయించిన ఘన త తమదేనన్నారు. బాబు మాట్లాడుతుండగా స్థానిక ఉన్నత పాఠశాల బాలిక నిఖిలకు మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ సార్ మీ తొమ్మిదేళ్ల పాలన ఎంతో బాగుందని, అయితే మా గ్రామం పక్కనుండే గోదావరి వెళ్తుందని, కానీ మా గ్రామానికి తాగునీరు అందడం లేదని తెలిపింది. అలాగే మా పాఠశాలలో బా ల బాలికలకు మరుగుదొడ్లు లేవని తెలిపింది. దీంతో ఆయన మాట్లాడుతూ ఎంపీ నిధులతో ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు లిఫ్ట్ సౌకర్యం కల్పించడం ద్వారా వెల్మల్ గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోన్‌లో కాకుండా న్యూ వెల్మల్‌లోనే ఏ ర్పాటు చేయాలని విద్యార్థులు కో రడంతో చంద్రబాబు ప్రసంగ స్థలం నుండే కలెక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారాన్ని అందించారు. బొప్పారంలో ఎస్సారెస్పీలో ముంపుకు గురైన గ్రామాల యువకులు భూము లు కో ల్పోయిన వారికి భూములను, ఉద్యోగాలను కల్పించాలని కోరారు. దీంతో బాబు వెంటనే కలెక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖను పంపారు.వెల్మల్ గ్రామంలో ప్రారంభమైన బాబు పాదయాత్ర పీచర, ధర్మారం, మల్లాపూర్, లక్ష్మణచాంద మీదుగా సాగింది. పాదయాత్రలో ఆయన వెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భీంరెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బాబర్ బేగ్, టీడీపీ నాయకులు లోలం శ్యామ్‌సుందర్, భూషణ్‌రెడ్డి, ఎమ్మెల్యే నగేష్‌లతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఈ గ్రామం ఎంతో చల్లగా ఉంది: మూఠాపూర్‌లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈ గ్రామం ఎం తో చల్లగా ఉంది. ఇక్కడే పడుకోవాలని పిస్తోందని అన్నారు. జిల్లాలో పాదయాత్ర చేసినప్పటికీ ఇంతటి చల్లని వాతావరణం, చెట్లు ఎక్కడా కనిపించలేవని, తాను నడిచి అలసిపోయినప్పటికీ ఈ చెట్టుకింద నిలబడి మాట్లాడడం ఆనందాన్ని కలిగించిందన్నారు.

బీసీల రాజ్యాధికారం కోసం కృషి: బొప్పారం గ్రామ పంట పొలాల్లో ఏర్పాటు చేసిన సిర్పూర్ కాగజ్‌నగర్ ని యోజక వర్గస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు రానున్న ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తామని ప్రకటించామని, మహిళలకు కూడా 33 శాతం సీట్లు ఇచ్చే ప్ర యత్నం చేస్తామని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించబోమని, తగిన సమయంలో తగిన గుర్తిం పు ఇస్తామని కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.సిర్పూర్, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూర్‌కు చెందిన కాం గ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు సమక్షంలో చేరారు.

బాబుకు బంతిపూల సైకిల్: ఖానాపూర్: లక్ష్మణచాంద మండ లం కొత్త వెల్మల్ గ్రామంలో మీకోసం పాదయాత్రలో మాట్లాడుతున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఒకరు బంతి పూలతో తయారు చేసిన సైకిల్‌ను బహుకరించారు.

చంద్రబాబుకు వినతుల వెల్లువ: నిర్మల్ మండలంలోని మంజులాపూర్, తాంస గ్రామాల మధ్య గల స్వర్ణ ప్రాజెక్టుపై బ్రిడ్జి నిర్మించాలని తాంస గ్రామస్థులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి చిట్యాల్‌లో వినతి పత్రం సమర్పించారు.చిట్యాల్ గ్రామ సమీపంలో గల డాంబర్ ప్లాంట్‌ను తొలగించాలని, దీంతో కాలుష్యం తలెత్తి అనేక అనారోగ్యాలకు గురవుతున్నామని చం ద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు. దిలావర్‌పూర్ మండలం లోలం గ్రామ ఎస్సారెస్పీ ముంపు బాధితులకు నష్టపరిహారం కోసం వినతి పత్రం సమర్పించారు.

అవినీతిని అంతమొందించడమే లక్ష్యం: నిర్మల్/ నిర్మల్ అర్బన్/ లక్ష్మణచాంద : రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిని అంతమోదించడానికి కంకణబద్ధుని అయ్యాయని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. బుధవా రం రాత్రి పాదయాత్రలో భాగంగా లక్ష్మణచాంద మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్ఆర్ఎస్‌పీ ప్రాజెక్టులో ముం పునకు గురైన గ్రామాల బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.