December 13, 2012

కాళ్లిరిగిన కొయ్యబొమ్మ!

నిర్మల్..ఆదిలాబాద్ జిల్లాకే కాదు, మొత్తం ఆంధ్ర దేశానికే సాంస్కృతిక చిహ్నం. కొయ్య బొమ్మల కుటీర పరిశ్రమే ఇక్కడి వేలాది కుటుంబాలకు ఆధారం. సృజనాత్మక కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకునే ఈ అందమైన బొమ్మలకు దేశ ,విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ఈ విషయం అప్పట్లోనే గుర్తించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాను. అటు కళాకారులూ ఇటు రాష్ట్రమూ ఆర్థికంగా బాగు పడేలా చర్యలు తీసు కున్నాను.

ఇతర దేశాల ప్రతినిధులు, వీఐపీలు ఎవరొచ్చినా నిర్మల్ కొయ్యబొమ్మల విశిష్టతను ప్రత్యేకంగా పరిచయం చేసేవాళ్లం. హైదరాబాద్ శిల్పారామంలో ఆ బొమ్మలు పెట్టించి ప్రోత్సహించాం. పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చేశాం. ఎండకు, వానకు బొమ్మలు దెబ్బతినకుండా షెడ్లు కట్టించాం. ఎంతో చేసి వీళ్లకప్పగిస్తే, ఉన్నదాన్నీ నిలుపుకోలేకపోయారు. కొయ్యబొమ్మల కాళ్లు విరిచారు. బొమ్మలు తయారు చేయడానికి కొనికి కర్ర వాడతారు. ఈ కలప వేగంగా అంతరించిపోతోంది. పైగా అన్నిహంగులతో దిగుతున్న చైనా బొమ్మలతో పోటీ మరింత కుంగదీస్తోంది.

కొనికి మొక్క పెంపకం, మార్కెట్ నియంత్రణ తదితర చర్యలు తీసుకోకుంటే నిర్మల్ బొమ్మ బతికి బట్టకట్టలేదనిపిస్తోంది. మామడ వైపు వెళుతుండగా 'అదే సరస్వతి కాలువ' అని ఓ రైతు చూపించాడు. నిర్మల్ ఆయకట్టుకు వరదాయని ఈ కెనాల్. ఈ ప్రధాన కాలువలో చాలాచోట్ల మట్టి పేరుకుపోవడం కనిపించింది. ఎస్ఆర్ఎస్‌పీకి నీళ్లొస్తేనే ఈ పంట కాలువ నిండుతుందని ఆ రైతు చెప్పుకొచ్చాడు. పైనున్న బాబ్లీ ప్రాజెక్టు నిండి నీళ్లు కిందకు పారితేనే కాలువలు నిండుతాయంటూ ఉన్న పరిస్థితిని, తమ దీనస్థితిని కళ్లకు కట్టాడు.

"ఏటా తంటానే సార్. పంట వేయాలా వద్దా అనేది చివరిదాకా తేల్చుకోలేకపోతున్నాం. వేసి నీళ్లు రాకపోతే నిండా మునిగిపోతాం'' అని ఆయన వాపోతుంటే.. నా హయాంలో ఎస్ఆర్ఎస్‌పీ బ్యాక్‌వాటర్ ఆయకట్టుకు లిప్టుల ద్వారా నీళ్లు అందించిన విషయం గుర్తొచ్చింది. అదే అడిగితే..'కరెంట్ లేకుండా లిప్టులెక్కడ పనిచేస్తాయి సార్' అన్న జవాబొచ్చింది. నిర్మల్‌బొమ్మకే కాదు, సరస్వతి కాలువకూ ప్రాణం పోయాల్సిన బాధ్యత నాదేనన్న విషయాన్ని ఆ రైతు మాటలు మరింతగా గుర్తుచేశాయి.