May 8, 2013

తెలుగువారంటే సోనియాకు గౌరవం లేదా?

ఆమె గైర్హాజరుకు కారణం ఎవరు
కాంగ్రెస్ ఎంపీలలో తీవ్ర విభేదాలు

న్యూఢిల్లీ : మాజీప్రధాని పీవీ నరసింహారావు భౌతికకాయాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనివ్వకుండా చేసినందుకు అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చాలామంది తప్పుబట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో చాటిచెప్పిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రాకుండా సోనియాగాంధీ తప్పు చేశారని, తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు కాంగ్రెస్ ఎంపీల నుంచే రావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే సోనియా గౌరవం ఎంతో పెరిగేదని అంగీకరిస్తున్నారు.

నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ మంగళవారం కూడా తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తమ కుటుంబాన్ని ఏకం చేశారని ఎంపీలు అంటున్నారు. కానీ కొద్దిమంది ఎంపీల చెప్పుడు మాటలు విని ఆమె తన స్థాయికి భిన్నంగా వ్యవహరించారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందువల్ల తామెలా వెళ్తామని పనబాక లక్ష్మి, కేఎస్‌రావు, సాయిప్రతాప్, అనంత వెంకటరెడ్డి చెప్పడం, మరో ఒకరిద్దరు ఎంపీలు ఆమెకు తప్పుడు సలహాలనివ్వడంతో విగ్రహావిష్కరణకు హాజరు కాకుండా సోనియా వెనుకంజ వేశారని తెలుస్తోంది.

"నిజానికి వైఎస్ ఎన్టీఆర్‌తో తీవ్రంగా విభేదించేవారు. అయినా పార్లమెంట్‌లో ఒక తెలుగునేత విగ్రహావిష్కరణ జరిగితే వెళ్లడం మన ధర్మం.. సోనియా రావట్లేదని తెలిసి వెళ్లలేకపోయాం'' అని కేవీపీ అన్నారు. అయితే అదే సమయంలో సోనియా విగ్ర హావిష్కరణకు రారని తెలిసినా.. కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, బాపిరాజు, పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్టీఆర్ పట్ల గౌరవంతో విగ్రహావిష్కరణకు వెళ్లారు.

కేవలం పురందేశ్వరి పట్ల కోపంతోనే కొందరు విగ్రహావిష్కరణకు వెళ్లలేదని, సోనియాను కూడా వెళ్లకుండా అడ్డుపడ్డారని వ్యాఖ్యానాలు వినపడ్డాయి. ఏమైనా ఈ కార్యక్రమానికి వెళ్లే విషయంలో కాంగ్రెస్ ఎంపీలలో చీలికలు స్పష్టంగా కనపడ్డాయి. చంద్రబాబుకు ప్రాధాన్యం లభించినా ఈ కార్యక్రమం సుఖాంతం అయినందుకు పలువురు పురందేశ్వరిని అభినందించారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రత్యేకంగా పురందేశ్వరిని పిలిచి ఆహ్వానాల విషయంలో తాను ప్రశ్నించినందుకు ఏమీ అనుకోకూడదని, కార్యక్రమం బాగా జరిగిందని అభినందించారు.