May 8, 2013

పార్లమెంటులో అన్నగారు! ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్

ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల హాజరు
చంద్రబాబు సహా టీడీపీ నాయకులు, నందమూరి కుటుంబం రాక
అందరినీ దగ్గరుండి ఆహ్వానించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి
ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించడమే లక్ష్యం: చంద్రబాబు



న్యూఢిల్లీ : తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహం పార్లమెంటులో ప్రతిష్ఠితమైంది. 9.3 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం 10.30 గంటలకు ఆవిష్కరించారు. పార్లమెంటు భవనంలో రాజ్యసభ ప్రవేశప్రాంతం కుడివైపున దీన్ని ఏర్పాటుచేశారు.

ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ , పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ నాయకులు, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, లక్ష్మీపార్వతి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అందరికీ స్వాగతం పలికారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మయాచార్యను సత్కరించారు.