May 8, 2013

తెలుగువారికి అవమానం సోనియా తీరు అప్పుడూ.. ఇప్పుడూ అంతే


గైర్హాజరుపై టీడీపీ వర్గాల ఆవేదన

హైదరాబాద్ : పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం తెలుగువారి మనసు గాయపడేలా నిర్వహించారని టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. గతంలో పీవీ నరసింహారావు విషయంలో వ్యవహరించినట్లే ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా వ్యవహరించారని, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఒక తంతులా ముగించారని ఆ పార్టీ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరైనా సోనియా గైర్హాజరు కావడం ఎన్టీ రామారావును అగౌరవపర్చడమేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

తెలుగువారిలో తొలి ప్రధాని అయిన పీవీ విషయంలోనూ సోనియా ఇలాగే కక్షపూరితంగా వ్యవహరించారని, ఆయన చనిపోతే కనీసం చూడటానికి కూడా రాలేదని గుర్తుచేశారు. విగ్రహావిష్కరణ కూడా మరీ మొక్కుబడి తంతులా పూర్తి చేశారన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కొద్ది నిమషాల్లోనే మొత్తం కార్యక్రమాన్ని పూర్తిచేశారని, ఎన్టీఆర్‌ను స్మరించుకోవడానికి.. ఆయన గురించి రెండు మాటలు చెప్పడానికి ఎవరికీ అవకాశం ఇవ్వలేదని వారంటున్నారు.

'గతంలో ఇతర నేతల విగ్రహావిష్కరణ కార్యక్రమాలు కనీసం అరగంటపాటు జరిగాయి. ఇప్పుడు మాత్రం అలా జరగలేదు. అనేక మంది ప్రముఖులొచ్చినా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవాల్సి వచ్చింది' అని ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ ఒకరు వాపోయారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్లమెంటు ఆవరణలోని తమ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కూర్చున్నప్పుడు ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ఉత్తరాది నేతల విగ్రహావిష్కరణ అయితే పార్లమెంటులో దీనికి భిన్నమైన వాతావరణం కనిపించేదని కొందరు ఎంపీలు ఆయనతో అన్నారు.

చంద్రబాబు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. 'అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టే విషయంలో ఇలాగే చేశారు. పార్లమెంటులో విగ్రహావిష్కరణను సంవత్సరాల ఏళ్లతరబడి సాగదీశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్దాం' అని ఆయన వారితో అన్నారు. కాగా, ఎన్టీఆర్ పట్ల రాజకీయ ద్వేషభావం ఉండటం వల్లే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ కార్యక్రమానికి రాలేదని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విమర్శించారు.

"జాతికి ఘనమైన సేవలు అందించిన విశిష్ట నేతలకే పార్లమెంటులో విగ్రహం పెడతారు. ప్రతినేతకూ పెట్టరు. లోక్‌సభ స్పీకర్ నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరు కావడం అనవాయితీ. కాని సోనియా గాంధీ ఈ అనవాయితీని విస్మరించి ఎన్టీ రామారావు స్మృతిని అగౌరవపర్చారు. ఇందిరాగాంధీని ఎన్టీఆర్ ధిక్కరించారన్న కక్షనే ఆమె మనసులో పెట్టుకొన్నట్లు కనిపిస్తోంది. తాను రాకుండా చూసుకోవడానికి ఎంపీల ఫిర్యాదుల వ్యవహారం నడిపించారు. ఆమె రాదల్చుకొంటే ఈ ఫిర్యాదులు ఒక అడ్డా''
- టీడీపీ ఎంపీ