May 8, 2013

అత్యంత సంతోషకరమైన రోజు: చంద్రబాబు



అత్యంత సంతోషకరమైన రోజు: చంద్రబాబు
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం టీడీపీకి, తెలుగుజాతికి, దేశ ప్రజలకు అత్యంత సంతోషకరమైన సందర్భమని చంద్రబాబు అన్నారు. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమ నాయకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయటం పట్ల పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ సభ్యుడిగా తనకు ఎంతో ఆనందంగా ఉన్నదని, ఈ కార్యక్రమంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్ఫూర్తి, ప్రేరణతో తాము ఆయన లేని లోటును భర్తీ చేసుకుంటూ, ఆయన ఆశీస్సులతో ముందుకు వెళుతున్నామన్నారు.

పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది తెలుగు ప్రజల చిరకాల వాంఛ అని, దీనికి ఎన్నో అవాంతరాలు ఎదురైనా.. చాలాకాలంగా టీడీపీ ప్రయత్నిస్తూనే ఉన్నదని తెలిపారు. ఎన్టీఆర్ దగ్గర పనిచేయడం తన అదృష్టమని, ఆయన ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించేవారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సేవ అంటే ఏమిటో ఆయనే నేర్పించారని చెప్పారు. ఒకసారి 104 డిగ్రీల జ్వరం ఉన్నా.. భారీ వర్షాలతో సతమతం అవుతున్న ప్రజల వద్దకు వెళ్లి వచ్చిన తర్వాతే విశ్రాంతి తీసుకున్నారని, ఇది ఆయన పట్టుదలకు నిదర్శనమని చెప్పారు.



ఒకసారి ఢిల్లీ వచ్చామని, ఆరోగ్య సమస్య రావటంతో ఆయన ఆస్పత్రి పాలైనా, తనను మాత్రం అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి పంపారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు తమ మధ్య ఎన్నో ఉన్నాయన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉండాలని ఆయన తపన పడ్డారన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు.

ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని, సహకార సమాఖ్య వ్యవస్థ ఏర్పడాలని, ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాలన్న సిద్ధాంతాలను ఆయన ప్రతిపాదించారని, అవన్నీ ఇప్పుడు వాస్తవరూపం దాలుస్తున్నాయన్నారు. సోనియా హాజరు కాకపోవటం, విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదాలను ప్రస్తావించగా.. తమకు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటే ముఖ్యమని, తెలుగు ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నది తెలుగు ప్రజలందరి ఆకాంక్ష అని, ఆ మహా నాయకుడికి ఘన నివాళులు అర్పించాలంటే రాజకీయాలకతీతంగా కలసి పనిచేయాలని చెప్పారు.

ఈ మేరకు తాము ఉద్యమాలు చేశామని, ఢిల్లీలోని నాయకులు మాత్రం గుర్తించలేదన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అన్ని మహానాడుల్లోనూ తీర్మానాలు చేశామని, పోరాటాన్ని కొనసాగించి భారతరత్న సాధిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విగ్రహ నమూనా తమ వద్ద ఉన్నదని, దాన్ని పరిశీలించి ఆమోదిస్తే తక్షణం ఏర్పాటు చేయవచ్చని వెల్లడించారు.

హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారు.. ఉపరాష్ట్రపతి హమీద్అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు కమల్‌నాథ్, జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, గులాంనబీ ఆజాద్, చిరంజీవి, పళ్లంరాజు, నారాయణస్వామి, రాజీవ్ శుక్లా, మునియప్ప, జ్యోతిరాదిత్య సింథియా, కిల్లి కృపారాణి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి, వెంకయ్యనాయుడు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, అజీజ్ పాషా, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా, శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలె, డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, అన్నాడీఎంకే నాయకుడు తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఒ బ్రెయిన్, లోక్‌శక్తి పార్టీ నాయకుడు రామ్‌విలాశ్ పాశ్వాన్, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, మందా జగన్నాథం, అనూ టాండన్, రాపోలు ఆనందభాస్కర్, స్వతంత్ర ఎంపీ జయప్రద హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలువేసి నివాళులర్పించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, ఆయన భార్య, బాలకృష్ణ దంపతులు, రామకృష్ణ దంపతులు, విజయకృష్ణ, మోహనకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టీడీపీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు సహా పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అచ్చతెలుగు పంచెకట్టుతో హాజరై అలరించారు. సినీనటుడు మోహన్‌బాబు, మాజీ ఎంపీలు యలమంచిలి శివాజీ, ఎంవీవీఎస్ మూర్తి, ఎన్టీఆర్ వ్యక్తిగత సిబ్బంది, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హాజరయ్యారు. కాగా.. వైద్య చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ మాత్రం హాజరుకాలేకపోయారు.

"ఎన్టీఆర్ హీరోయిన్‌ను తాకకుండానే శృంగారం పండించేవారు. ముఖ కవళికలతోనే గొప్ప అభినయాన్ని ప్రదర్శించేవారు. ప్రజలకు ఏదో చేయాలని ఎప్పు డూ తపించిపోయేవారు. రాజకీయాల్లో అవినీతి మకిలి అంటని ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్''
-బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు

"ఎన్టీఆర్ సభలకు వస్తున్న జనాన్ని చూసిన ఇందిరాగాంధీ.. అందుకు కారణమేంటని అడిగా రు. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి వేషాలు వేయడం వల్లేనని కాంగ్రెస్ వాళ్లు చెప్పారు. అయితే ఆయన శత్రువులుగా నటించినవారిని తే వాలని ఇందిర చెబితే, 'ఆ వేషాలు కూడా ఆయనే వేశార'న్నారు.''
-యలమంచిలి శివాజీ

"మహబూబ్‌నగర్‌లో ఆకలిచావులు ఉన్నాయని ఒకసారి మేం ఎన్టీఆర్‌కు చెప్పాం. వెంటనే దాని పై సమాచారం రప్పించుకుని, 24 గంటల్లో 50వేల కరువు పింఛన్లు మంజూరు చేశారు. అంత వేగం గా స్పందించి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆయన ప్రజలకు చిరస్మరణీయుడయ్యారు''
- సీపీఐ నేత సురవరం