May 8, 2013

ఎన్టీఆర్ అంత అందం.. మళ్లీ మహేశ్‌కే: వెంకయ్య

భారతరత్న కూడా సాధిస్తా
పుస్తకావిష్కరణ సభలో పురందేశ్వరి



న్యూఢిల్లీ : తన తండ్రిని అభిమానించే అందరి సహకారంతో ఎన్టీఆర్‌కు భారతరత్నను కూడా సాధిస్తానని కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అనంతరం ఏపీభవన్‌లో దగ్గుబాటి దంపతులు ప్రచురించిన ఎన్టీఆర్ ఛాయాచిత్ర పుస్తకావిష్కణ కార్యక్రమం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ తెరిచిన పుస్తకం లాంటిదని, కానీ ఆయన వ్యక్తిత్వం గురించి బిడ్డలమైన తమకంటే ప్రజలకే ఎక్కువ తెలుసుకునే అవకాశం లభించిందని ఈ సందర్భంగా పురందేశ్వరి అన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించటం అంత సులభం కాదని, కొంత కష్టమైనా.. ఇకపై తాను ఆ దిశగానే పనిచేస్తానన్నారు. చరిత్ర కొందరిని బాధిస్తుందని, అంత మాత్రాన వారి కోసం చరిత్రను బయటపెట్టకపోవటం సముచితం కాదని, కాబట్టి ఎన్టీఆర్‌తో వెంకయ్యనాయుడికి ఉన్న అనుభవాలను పుస్తకరూపంలో తీసుకురావాలని ఆమె కోరారు. రాజీలేని రాజకీయ యోధుడు ఎన్టీఆర్ అని వెంకయ్య నాయుడు కీర్తించారు. అటు రాజకీయ రంగంలోను, ఇటు చలనచిత్ర రంగంలోను ఎన్టీఆర్ అందం అందరినీ ఆకర్షించేదని, ఇప్పుడు అంత అందం మహేశ్‌బాబుకు మాత్రమే ఉందన్నారు.

రాష్ట్రంలో అసలు సిసలు కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని, ఎంతోమంది చేయలేని పనిని ఆయన చేసి చూపించారన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం ముందు ఒక శకం అయితే, స్వాతంత్య్రానంతరం ఎన్టీఆర్‌తో మరొక శకం ప్రారంభమైందని బాలకృష్ణ అన్నారు. అత్యున్నత శిఖరాలు చేరాలంటే సత్సంకల్పం, అకుంఠిత దీక్ష కావాలని ఆయన ఎప్పుడూ అంటుండేవారన్నారు.

ఆయన ఆంధ్రప్రదేశ్‌లో మొదలుపెట్టిన కార్యక్రమాలను తర్వాత దేశవ్యాప్తంగా అంతా అనుసరించారని చెప్పారు. ఎన్టీఆర్ బతికుంటే ప్రధాని అయ్యేవారని ఆచార్య కోనేరు రామకృష్ణారావు చెప్పారు. ఇది ఏ ఒక్కరి విజయమో కాదని, తెలుగు ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులంతా సాధించిన విజయమని సభకు అధ్యక్షత వహించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జయకృష్ణ, మోహనకృష్ణ, జయశంకరకృష్ణ, పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.