May 7, 2013

అన్నగారి విగ్రహావిష్కరణ నేడే చంద్రబాబుకు మీరా ఆహ్వానం..


సమసిన వివాదం

న్యూఢిల్లీ, హైదరాబాద్ : ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంగళవారం పార్లమెంట్‌లో ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్‌లోని గేట్ నంబర్ 12 సమీపంలో రాజ్యసభకు వెళ్లే లాబీలో ఉదయం 10:30 గంటలకు అన్నగారి విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పీకర్ ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయించారు.

స్పీకర్ కార్యాలయం అధికారులు చంద్రబాబుకు ఫోన్‌చేసి చెప్పడమే కాక, లేఖ కూడా రాయడంతో ఆయన మంగళవారం విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రావాలని నిర్ణయించారు. దీంతో ఆహ్వానం విషయంలో టీడీపీ- కేంద్రమంత్రి పురందేశ్వరి మధ్య ఏర్పడిన వివాదం సమసిపోయింది. పార్లమెంట్‌కు విగ్రహాన్ని విరాళంగా ఇచ్చేందుకు పురందేశ్వరికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, కొందరు సినీ ప్రముఖులను పురందేశ్వరి ఈ విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు. చంద్రబాబు కార్యాలయానికి కూడా తాను లేఖ పంపానని ఆమె చెప్పారు.

కానీ చంద్రబాబుకు అధికారికంగా ఆహ్వానం పంపనందుకు ఆగ్రహించిన టీడీపీ ఎంపీలు సోమవారం స్పీకర్ మీరాకుమార్‌ను మూడుసార్లు కలుసుకున్నారు. టీడీపీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకులు కొనకళ్ల నారాయణరావు, రమేశ్ రాథోడ్, ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు ఒకసారి స్పీకర్‌ను కలిసి తమ నేతకు ఆహ్వానం పంపలేదని చెప్పారు. స్పీకర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందాల్సిందేనన్నారు.

పురందేశ్వరి నుంచి కూడా తమకు సరిగా ఆహ్వానం అందలేదని, ఇది ప్రైవేట్ కార్యక్రమం కాదని టీడీపీ ఎంపీలు ఆమెకు స్పష్టంచేశారు. తాను మళ్లీ పిలిపించి మాట్లాడతానని స్పీకర్ వారికి నచ్చజెప్పారు. అనంతరం ఆమె పురందేశ్వరిని పిలిచి చంద్రబాబుకు ఆహ్వానంపై ప్రశ్నించారు. తాను చంద్రబాబుకూ లేఖ పంపానని ఆమె ఆధారాలు సమర్పించారు. ఆమె వెళ్లిన తర్వాత మ«ధ్యాహ్నం 12 గంటలకు మరోసారి స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం పంపాలని పట్టుబట్టారు. తాను ఆలోచిస్తానని చెప్పి టీడీపీ సభ్యులను కొద్దిసేపు వేచి ఉండమన్న స్పీకర్ కార్యాలయం అధికారులతో మాట్లాడారు.

తర్వాత మళ్లీ టీడీపీ ఎంపీలను పిలిచి తన కార్యాలయం చంద్రబాబుతో మాట్లాడి ఆహ్వానం పంపిందని చెప్పడంతో వారు శాంతించారు. మంగళవారం ఉదయం 10:30కి జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించారు. అనంతరం టీడీపీ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయటంపై తామంతా సంతోషిస్తున్నామని, ఈ శుభ సందర్భంలో 13 ఏళ్లుగా విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం లేకపోవడం తమను బాధపెట్టిందని తెలిపారు.

విగ్రహావిష్కరణ స్పీకర్ చేతులమీదుగా జరుగుతున్నప్పుడు అధికారిక ఆహ్వానం లేదని తాము బాధపడ్డామే తప్ప, తమకు ఇందులో ఎలాంటి అహాలూ లేవని నామా స్పష్టంచేశారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పార్లమెంటుకు వస్తున్నప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు ముందుగానే చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తాము ఎలాంటి రాజకీయాలకు పాల్పడట్లేదని, చంద్రబాబుకు ఆహ్వానం రాకపోవటంతో ప్రజలందరికీ రాజకీయాలు అర్థమయ్యాయని చెప్పారు.

కథ సుఖాంతం: దగ్గుబాటి దంపతులు

విగ్రహావిష్కరణకు చంద్రబాబు రావాలని నిర్ణయించుకోవడం పట్ల కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంతోషం ప్రకటించారు. 'కథ సుఖాంతమైంది.. అంతా వస్తున్నారు.. ఇప్పుడు వివాదానికి తావు లేదు' అని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబుకు ఆహ్వానం పంపామని, పార్టీ కార్యాలయంలో ఆయన అధికారి ఒకరు ఆ లేఖ తీసుకున్నారని పురందేశ్వరి చెప్పారు.

కాంగ్రెస్ కుట్ర విఫలం: కోడెల

ఎన్టీఆర్, చంద్రబాబును వేరుచేసి చూపించాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం విఫలమైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

వైఎస్ విగ్రహం కూడా పెట్టాలి: భూమన
ఎన్టీఆర్ విగ్రహంలాగే దివంగత సీఎం వైఎస్ విగ్రహం కూడా పార్లమెంటులో పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పురందేశ్వరిపై కేసు పెడతా: లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తనను అహ్వానించలేదని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి చెప్పారు. తనకు అలాంటిదేమీ అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో పార్లమెంటరీ కమిటీని పురందేశ్వరి తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ స్పందన లేకపోతే పురందేశ్వరి, మీరాకుమార్‌లపై కేసు పెడతానన్నారు.