April 18, 2013

ప్రజాభిమాన పాత్రుడు చంద్రబాబు

విశాఖపట్నం:నిస్వార్థ సేవకు చిరునామా..టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మినబంటు. నాటి 'మీకోసం', నేటి 'వస్తున్నా మీకోసం' యాత్రకు సమన్వయకర్త...గరికిపాటి మోహనరావు. ఎటువంటి పదవులు, ప్రయోజనాలు ఆశించకుండా రాముడికి హనుమంతునిలా చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడెనిమిది నెలలుగా కుటుంబానికి దూరంగా వుంటూ బాబు పాదయాత్ర విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరో పది రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో 'వస్తున్నా...మీకోసం' కార్యక్రమం స్మృతులను ఆయన 'ఆంధ్రజ్యోతి'తో పంచుకున్నారు. ఆ విశేషాలు...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర ప్రజాభిమానం పొందడంలో విజయవంతమైందని యాత్ర సమన్వయకర్త గరికిపాటి మోహనరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేయడం ద్వారా చంద్రబాబు తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నారని చెప్పారు. యువత, మహిళలు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన ముఖ్యమంత్రి కావాలన్నదే వారి ఆకాంక్షగా కనిపిస్తోందని వెల్లడించారు. ఏడు నెలల పాదయాత్రలో ఎన్నో తీపిగుర్తులు-చేదు జ్ఞాపకాలు తమకు ఎదురయ్యాయని పేర్కొన్నారు. పాదయాత్ర ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో బుధవారం నర్సీపట్నంలో ఆయన 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో మాట్లాడారు.

'అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్ల నుంచి చంద్రబాబు ప్రజల మధ్యనే ఉంటున్నారు...వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటున్నారు...నేనున్నానంటూ ఓదారుస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భావించిన చంద్రబాబు సుదీర్ఘమైన సాహసయాత్రకు పూనుకున్నారు' అని మోహనరావు తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లుగా అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని పాదయాత్రలో ఆయన తెలుసుకోగలిగారన్నారు. తొంభై శాతానికిపైగా ప్రజలు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఆయన ముందు మొరపెట్టుకోవడం రాష్ట్రంలో పరిపాలనకు అద్దం పడుతోందన్నారు.

రైతు, రైతుకూలీ, మహిళ, యువత, చేతివృత్తిదారులు...ఇలా అనేకమంది తమ సమ్యలు పరిష్కరించాలంటూ ఆయనకు అర్జీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు గతంలో రెండు, మూడు పర్యాయాలు బస్సు యాత్రలు నిర్వహించినప్పటికీ ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్లలో మహిళలు, యువత తీవ్రమైన నిరాశ, నిస్పృహకు గురయ్యారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు మఖ్యమంత్రి అయితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని మోహనరావు విశ్లేషించారు. ఎక్కడికెళ్లినా మహిళలు, యువతే ముందుండి ఆయనకు స్వాగతం పలుకుతూ తమ మద్దతు తెలుపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు, యువత ఇప్పుడొస్తున్నంత భారీ స్థాయిలో ఎప్పుడూ రాలేదని చెప్పారు. పాదయాత్రలో ప్రజలను కలుసుకోవడం ఒక్కటే కాకుండా పార్టీ పనితీరు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా నుంచి నియోజకవర్గ సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు పలు ప్రాంతాల్లో నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించగలిగారన్నారు. వచ్చే నెలలో పార్టీ సమీక్షకు సంబంధించి విస్తృతంగా కసరత్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అధినాయకుడే కాదు నాయకులు కూడా గ్రామాల్లో ప్రజలతో మమేకం కావాలన్న ఆకాంక్ష కొంతమేరకు తీరిందన్నారు. ఏడు నెలల పాదయాత్ర దేశంలోనే ఒక రికార్డుగా ఆయన చెప్పారు.

'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర మహాయజ్ఞంలా వందలాది మంది అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షగా అన్ని వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. తమలో తారతమ్య భేదాలు లేకుండా అంతా కలిసి పనిచేస్తున్నామని అన్నారు. పాదయాత్రకు రెండు నెలల ముందే కసరత్తు చేశామని, అందుకే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతోందని తెలిపారు. చంద్రబాబు శారీరకంగా బాగా అలసిపోయారని, రోజూ కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు వస్తున్నప్పటికీ ప్రజల కష్టాలు తీర్చాలన్న తపనతో వాటిని లెక్కచేయడంలేదని ఆవేదనగా చెప్పారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామని మోహనరావు చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్‌లో ఆయన ప్రసంగిస్తుండగా వేదిక కూలిపోవడం ఓ చేదు జ్ఞాపకమని అన్నారు. ఆరోజు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే వరకూ తాము నిద్రపోలేదని, అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. అలాగే గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ పరిధి వలకనూరు వేదిక మెట్లు కూలిపోయినప్పుడు కూడా ఎంతో కలవరానికి గురయ్యామని తెలిపారు. తామంతా భయపడుతుంటే ఆయనే తమకు మనోధైర్యాన్ని ఇచ్చి 'ధర్మపోరాటం చేస్తున్నాం...దేముడు మన వెనుకే ఉన్నాడు' అని భరోసా ఇస్తూ ముందుకుసాగడం ఆయనలో స్ఫూర్తిదాయక లక్షణానికి నిదర్శనమన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఓ బాలిక తన పేదరికాన్ని తెలియజేసినప్పుడు చంద్రబాబు చలించిపోయారని...ఆ సంఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ
కంటతడి పెట్టించిందన్నారు. ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్నదే ఆయన తపన అని వివరించారు.

పాదయాత్రకు ఎంతోమంది ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ప్రజలు, అభిమానులు ఇచ్చిన విరాళాల నుంచి కొంత మొత్తాన్ని ఆయన యాత్రలో పేద వృద్ధులకు ఇస్తున్నారని గరికిపాటి తెలిపారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు, విపక్షనేతగా మరో తొమ్మిదేళ్లు పనిచేసిన చంద్రబాబు ఎటువంటి భేషజంలేని వ్యక్తి అని, క్రమశిక్షణలో ఆయన రోల్‌మోడల్ అని గరికిపాటి కితాబిచ్చారు. మరో పది రోజుల్లో పాదయాత్ర ముగియనుందని, విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రజాభిమాన యాత్ర భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నట్టు మోహనరావు తెలిపారు.