April 18, 2013

మాడుగుల, చోడవరాల్లో టీడీపీయే గెలవాలి

 'ఆవిర్భావం నుంచి చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటల్లా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు చోట్లా టీడీపీయే గెలవాలి. ఈ బాధ్యత మీదే' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారు. నర్సీపట్నం పరిధిలోని బలిఘట్టం వద్ద చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత సమయం కంటే గంటా 45 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ సమీక్ష ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో కష్టించి పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని, మిమ్మల్ని గౌరవించే బాధ్యతను తాను తీసుకుంటానని బాబు చెప్పారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపడాలని సూచించారు.

నాయకులు బాగా పనిచేయడం లేదని అనడం లేదని, పార్టీ సమావేశాలు తగ్గిపోయాయని చెబుతున్నానని అన్నారు. ఒక్క ఏడాది కష్టపడితే కార్యకర్తలందరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో తరచూ సమావేశాలు నిర్వహించాలని, సలహాలు స్వీకరించాలని, ఎన్నికల నాటికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, టీడీపీ హయాంలో జరిగిన అభివద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు.

వర్గాలను ప్రోత్సహిస్తే పక్కనబెట్టండి వర్గాలను ప్రోత్సహించే నేతలను కార్యకర్తలే పక్కనపెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బుచ్చెయ్యపేట, మాడుగుల మండలాల నుంచి కొందరు కార్యకర్తలు పాలసంఘం, సహకారసంఘాల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని కార్యకర్తలు బాబు దృష్టికి తీసుకురాగా, పై విధంగా స్పందించారు.

చోడవరం ఎమ్మెల్యేకు స్థానిక ఎన్నికల పరీక్షలు ఉన్నాయి చోడవరం ఎమ్మెల్యే రాజు నూటికి నూరుమార్కులు తెచ్చుకోవడం కరక్టేనని, ఆయనకు ఇంకా స్థానిక ఎన్నికల పరీక్షలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తమ ఎమ్మెల్యే రాజు బాగానే పనిచేస్తున్నారని ఓ కార్యకర్త అనగా, బాబు ఇలా స్పందించారు. ఆ పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించాల్సిన బాధ్యతల రాజుపై ఉందని చెప్పారు.

రెండు నియోజకవర్గాల

కార్యకర్తలు కలిసిపోయారా సమీక్షకు హాజరైన కార్యకర్తలు నియోజవర్గాల వారీగా చేతులెత్తాలని బాబు కోరడంతో, రెండు వైపులా కార్యకర్తలు చేతులెత్తారు. రెండు నియోజకవర్గాల కార్యకర్తలు వేర్వేరుగా ఉంటారని అనుకున్నానని, అందరూ కలిసిపోయారని చంద్రబాబు ఛలోక్తి విసిరారు.

సభ ప్రారంభానికి ముందు జిల్లా కన్వీనర్ అయ్యన్నపాత్రుడు నాయకులందరినీ వేదికపైకి ఆహ్వానించారు. వేదికపై చోడవరం మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు బాబుకు చెరోవైపు కూర్చున్నారు.

సమీక్షలో చోడవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీపీలు జి.పెదబాబు, బి.తాతయ్యబాబు, మాజీ సర్పంచ్ మల్లునాయుడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎం.గౌరీశంకర్, నాయకులు కె.మత్స్యరాజు, ఆర్.రమణ, బి.లక్ష్మణరావు, ఎ.లక్ష్మణ్‌కుమార్, ఎం.వెంకటరమణ, డి.అప్పలనాయుడు, వి.అప్పారావు, గోవింద్, సింహాద్రి, మాడుగుల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు సరోజిని, నాయకులు ఎస్.రామునాయుడు, కె.నరసింగరావు, వర్మ, అద్దేపల్లి జగ్గారావు పాల్గొన్నారు. అంతకు ముందు నాయకులు చంద్రబాబుకు జ్ఞాపికను బహూకరించారు.