April 18, 2013

పట్నం జనసంద్రం

నర్సీపట్నం
: 'వస్తున్నా...మీకోసం' నాల్గవ రోజు చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పలికారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో గల బలిఘట్టం శివార్లలో మంగళవారం రాత్రి బసచేసిన చంద్రబాబు బుధవారం ఉదయం చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు తొలుత బలిఘట్టంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామంలో వందలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు చంద్రబాబు వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. దారిపొడవునా మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలికారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నం అబీద్ సెంటర్‌లో జరిగిన సభకు భారీగా ప్రజానీకం హాజరయ్యారు.

సభ ముగిసేసరికి రాత్రి 8.30 గంటలు అయినప్పటికీ ప్రజలు పట్టణం దాటేవరకు చంద్రబాబు వెంట నడిచారు. ఆయా సభల్లో వైఎస్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా స్థానిక సమస్యలను కూడా ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రజలను ఆకట్టుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా బుధవారం చంద్రబాబు తన నడకవేగాన్ని కొంత పెంచడమే కాకుండా ఉదయం నుంచి కాస్త హుషారుగా ఉండడం టీడీపీ శ్రేణులకు ఊరటనిచ్చింది.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు విజయ్‌బాబు, అయ్యన్న సోదరుడు, మాజీ సర్పంచ్ సన్యాసిపాత్రుడు, నియోజకవర్గ పరిధిలోగల నాలుగు మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా కృషిచేయడంతో జిల్లాలో ఇంతవరకు ఎక్కడాలేనివిధంగా నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలో చంద్రబాబు పాదయాత్ర కార్యక్రమం విజయవంతమైంది.