February 3, 2013

సమగ్ర వ్యవసాయాభివృద్ధికి కృషి


చంద్రబాబు దృష్టికి రైతులు తీసుకువచ్చిన అంశాలు

నాగార్జున సాగర్ 2, 3 వ జోన్లకు నీళ్లివ్వటం లేదు. సాగర్‌లో నీరున్నా.. నీ ళ్లు ఇవ్వటం లేదు. వ్యవసాయం తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ? - ఆళ్ళ గోపాలకృష్ణ, హనుమాన్ జంక్షన్

రెండేళ్ళ నుంచి రైతాంగం పంట నష్టపోవాల్సి వస్తోంది. ఆధునికీకరణ పనులు ఇప్పటి వరకు 10 శాతం కూడా పూర్తి కాలేదు. - గుడిసే బాలస్వామి, ఉంగుటూరు

ఎన్నో కష్టాల కోర్చి వరి పంటను పండిస్తున్నాం. పండించిన ధాన్యానికి గిట్టుబాటు కావటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. - పాతూరి బాపూజీ, గన్నవరం

పత్తి పంట లాభంగా ఉండటం లేదు. ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు పెడుతున్నాం. క్వింటాకు రూ. 10 వేలు అయినా గిట్టుబాటు ఉండాలి. - గింజుపల్లి రమేష్ , జగ్గయ్యపేట

జిల్లాలో పొగాకు రైతులందరికీ నష్టం వచ్చింది. ఒకప్పుడు వరితో పా టు ప్రధానంగా పొగాకును సాగు చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా పొగాకు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇరవై సిగరెట్లు ఉన్న ప్యాకెట్ రూ. 60 ధర పలుకుతోంది. ఒక కేజీ పొగాకు మాత్రం రూ.20 కూడా పలకటం లేదు. - జె.వేణుగోపాల్ రెడ్డి, మైలవరం

జిల్లాలో పండించిన మిర్చిని కోల్డ్ స్టోరేజ్‌లలో పెట్టాల్సి వస్తోంది. వడ్డీ ని పూర్తిగా ప్రభుత్వం మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. - కోటి వీరబాబు, చందర్లపాడు

చంద్రబాబు ప్రతిస్పందన సమగ్ర వ్యవసాయాభివృద్ధికి.. స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయటంతో పాటు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం. వ్యవసాయంపై ప్రభుత్వ పెత్తనం లేకుండా నేరుగా లాభసాటిగా ఉండాలని టీడీపీ కృషి చేస్తే కాంగ్రెస్ దానిని పూర్తిగా విస్మరించి వ్యవసాయాన్ని చంపేసింది. ఈ ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ లేదు. పామాయిల్‌కు మిని మం గిట్టుబాటు కల్పించాలి. చెరకు, మినుము, పత్తి దెబ్బతిన్నాయి. వ్యవసాయం లాభసాటిగా ఉండి, రైతులకు గిట్టుబాటు ఉంటే తప్ప రైతులు వ్యవసాయం చేయలేరని స్వామినాధన్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రభుత్వం స్వామినాధన్ కమిటీ ఊసెత్తటం లేదు.

ఒక ఇంట్లో ఐటీ చదువుతున్న వ్యక్తి ఉంటే.. పిల్లనివ్వటానికి వస్తున్నారు. అదే వ్యవసాయం చేస్తే పిల్లనివ్వటానికి కూడా రావటం లేదు. ప్రభుత్వం పాలసీలు చేసేటప్పుడు ఆలోచనలు చేయాలి. ఎరువులు, కూలి రేట్లు పెరిగాయి. పండించే పంటకు మాత్రం గిట్టుబాటు లేదు. ఉల్లిపాయలకు గోడౌన్లు పెట్టి రేటు పెరగకుండా చూశాం. చరిత్రలో చూడనంతగా కరెంట్ సమస్యలను చూస్తున్నాం. వైఎస్ రాజేశేఖరరెడ్డి అధిక రేటు పెట్టి కరెంటును కొనుగోలు చేశాడు. అది కూడా అప్పులు పెట్టారు. ఇప్పుడీ భారం అంతా.. చార్జీలు, సర్‌ఛార్జీల రూపంలో మీపై పడుతోంది. పత్తి రూ.7 వేలు పలుకుతున్న సందర్భంలో ఎగుమతులు నిలిపివేశారు. ఫలితంగా ఇప్పుడు రూ. 3 వేలకు పడిపోయింది. కౌలు రైతుల సమస్యలను కూడా పరిష్కరించి వారికి కూడా లాభం చేకూర్చే విధంగా కృషి చేస్తాం.