February 3, 2013

చంద్రబాబు పాదయాత్రలో కీలకపాత్ర ఐటీదే

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) అనగానే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడే గుర్తుకు వస్తారు. అలాంటి బాబు పాదయాత్రలో ఐటీ ప్రత్యేకత కనిపించకపోతే ఎలా ?...అవును మరి ఈ పాదయాత్రలో ఐటీ విభాగం కీలకపాత్రే పోషిస్తుంది. హిందూపురంలో ఆయన పాద యాత్ర ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఈ విభాగం ప్రాధాన్యత అనుక్షణం కనిపిస్తుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లోని ఈ విభాగం ఇపుడు ఏకంగా బాబు నడకతో కలిసి పయనిస్తుంది. చంద్రబాబు స్నేహితులు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసే ఫోన్ కాల్స్ ఈ విభాగం తీసుకుంటుంది.

అక్కడి నుంచి బాబుకు సమాచారం అందుతుంది. అలాగే బాబు ఇచ్చే ఏదైనా సమాచారం కూడా ఇక్కడి నుంచే బయటకు వెళుతుంది. కొన్ని సోషల్ నెట్ వర్క్‌కు అందించాల్సిన సమాచారం ఏమైనా ఉన్నా ఈ విభాగం ద్వారా వెంటనే వెళ్ళిపోతుంది. ఇదే సందర్భంలో ప్రపంచ, దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఇక్కడకు చేరుతుంది. దీని నుంచి ఆయా సమాచారాలు బాబుకు అందుతాయి. బాబు ఉదయం మేల్కొంది మొదలు రాత్రి విశ్రమించే వరకు ఈ విభాగం పనిచేస్తూనే ఉంటుంది. ఫోన్, ఎస్ఎంఎస్‌లు, ఇంటర్ నెట్ మెయిల్స్ ద్వారా ఈ సమాచారం రాక, పోకలు జరుగుతుంటాయి. ఇవే కాకుండా బాబు పాదయాత్రలో ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు, నాయకులు అందించే లేఖలన్నింటినీ స్వీకరించగానే అవి ఈ విభాగం తీసుకుంటుంది. వాటిని రికార్డు చేయడంతో పాటు విభజించి ఆయా విభాగాలకు ఇక్కడి నుంచి వెంటనే సమాచారం పంపుతారు.

విశేషం ఏమంటే ఎవరైనా సిగరెట్ పెట్టెపై సమాచారం రాసిచ్చినా దాన్ని కూడా స్వీకరించి చెత్తబుట్టలో వేయకుండా ఆ సమస్యకు సంబంధించిన విభాగానికి చేరవేస్తారు. ఇక బాబు పాదయాత్రలో ఎవరైనా అనాథలు, దీనులు విరాళాలు అడిగినపుడు వెం టనే ఆయన వారికి ప్రకటించినట్లైతే ఆ విరాళాన్ని కూడా ఈ విభాగం ద్వారా అక్కడికక్కడే అందజేస్తారు. పార్టీకి నేతలెవరైనా విరాళాలు ప్రకటించినా అవి కూడా ఈ విభాగమే స్వీకరిస్తుంది. ఈ నెట్ వర్క్ కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోనే అంతా ఏర్పాటు చేశారు. బాబుతో పాటే ఉంటూ కార్యక్రమాలన్నీ ఈ విభాగం చూసుకుంటూ అనుక్షణం కీలక విభాగంగా నిలుస్తుంది.

ఈ నెట్ వర్క్‌కోసం బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్‌లతో పాటు 3జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. బా బు పాదయాత్ర పూర్తయ్యే వరకు ఈ మొబైల్ ఐటీ విభాగం ఆయనతోనే కొనసాగుతుంది. అధికారులు, నేతలు, ప్రజలు, బాబు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మధ్య ఈ విభాగం కో ఆర్డినేట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవహారమంతా ఒకే ఒక వ్యక్తి నిర్వహించడం విశేషం కాగా ఆయన కృష్ణాజిల్లా వాసి కావడం మరో విశేషం. కైకలూరు నియోజకవర్గం కలిదిండి గ్రామానికి చెందిన పెరుమాళ్ళ నాగరాజు ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటున్నారు. ఈయన ఎంబీఏ చదివి 2008లో హైదరాబాద్ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని ఐటీ విభాగంలో ప్రవేశించారు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తూ ఇప్పుడు పాదయాత్రలో ఈ విభాగం మొత్తాన్ని తన చేతుల మీదుగా నడిపిస్తున్నారు. సాంకేతికపరమైన విభాగం అంతా నాగరాజు నిర్వహిస్తుండగా ఇతర వ్యవహారమంతా రాజగోపాల్ పర్యవేక్షిస్తుంటారు.