February 3, 2013

అవిశ్వాసం అమ్ముకోడానికా?

కిరణ్‌పై పెట్టినప్పుడు ఏం చేశారు?
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారుగా?
ఐదు సీట్లకే కేసుల ఎత్తివేతకు యత్నమా?
వైసీపీ నేతలపై చంద్రబాబు ధ్వజం
రాజకీయాల్లో 'మెరిట్' కోసం పాటుపడుతున్నట్టు వెల్లడి

  "రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) అంటోంది. మేం పెడితే అది అమ్ముకుంటుంది. మమ్మల్ని డిమాండ్ చేసేవాళ్లు.. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించారు?'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఘాటుగా ప్రశ్నించారు. ఒకరు చెబితే చెప్పించుకునే పరిస్థితుల్లో లేమని, వారికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు.

ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో ఆదివారం ఆయన పాదయాత్ర సాగించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు పేటల మీదుగా 6.6 కిలోమీటర్లు నడిచారు. యాత్రలో భాగంగా, డాబా కొట్ల సెంటర్‌లో ఎంతో భావోద్వేగంతో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై నిప్పులు చెరిగారు.

"పిల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది రానున్న ఎన్నికలలో తమ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. ప్రధానమంత్రి ఎంపికలో కీలక పాత్ర పోషిస్తామని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ఐదు సీట్లు వస్తేనే కేసులు మాఫీ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు'' అని కాంగ్రెస్ ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. రాజకీయాలతో మతాన్ని కలపడం సరికాదని అభిప్రాయపడ్డారు. "కులం అన్నది యాదృచ్ఛికం. మతం ఒక విశ్వాసం.

అమెరికాలో ఒబామాను ఆయన మెరిట్ చూసి గెలిపించారు. ఈరకమైన సంస్కృతిని తీసుకు రావాలన్నదే మా అభిమతం'' అని చెప్పుకొచ్చారు. తాము పుట్టించిన పిల్ల కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని ఢిల్లీలో కాం గ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని, ఆ రెండూ ఎప్పుడైనా కలిసిపోయేవేనన్నారు. కాంగ్రెస్ పార్టీది ధృతరాష్ట్ర కౌగిలి అని దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ బ్లాక్‌మెయిలింగ్ చేయటం ఆ పార్టీ విధానమన్నారు.

"ఎన్టీఆర్‌పై కేసులు పెట్టారు. నాపై వైఎస్ 35 కేసులు పెట్టించారు. 25 కమిషన్లు వేయించారు. నేను ఎక్కడా తప్పు చేయలేదు. లేదంటే నన్ను సైతం ఈ కాం గ్రెస్ నాయకులు బెదరగొట్టేవార''ని వివరించారు. సీల్డ్ కవర్ల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి పైరవీలు చేసుకుంటున్నాడని కిరణ్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దుష్టులు, దుర్మార్గులు పరిపాలన సాగిస్తున్నారని వారిని అంతమొందించటానికి రామరాజ్యాన్ని తీసుకురావాలని అన్నారు. సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పెట్టి ఓట్లను కొంటే తెలుగుదేశం పార్టీ పోరాడిందన్నారు. వైసీపీకి డిపాజిట్లు రాలేదని, టీఆర్ఎస్‌కు అడ్రస్ గల్లంతు అయిందని చెప్పుకొచ్చారు.

బాబు నిర్వచనాలు
విజయవాడ: పామరులు సైతం అర్థం చేసుకునే భాషలో ప్రసంగిస్తున్న చంద్రబాబు, ప్రభుత్వ పథకాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చారు.

నగదు బదిలీ పథకం - నకిలీ బదిలీ పథకం
రాజీవ్ స్వగృహ - కాంగ్రెస్ నేతల నివాస గృహ