February 3, 2013

పశ్చిమం పసుపుమయం

బహుదూరపు బాటసారి చంద్రబాబు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి దశ తిరుగుతోంది. నిన్నటి వరకూ టీడీపీకి గట్టి పట్టులేని పాతబస్తీలో చంద్రబాబు పాత్రయాత్రకు జనం పోటెత్తింది. ఈ ప్రభావం విజయవాడ నగరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జిల్లాలోకి అడుగు పెట్టిన రోజు పెనుగంచి ప్రోలుకు వచ్చిన జనం కూడా శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటెత్తిన జనవాహిని ముందు బలాదూరే అనిపించింది. అడుగడుగునా మహిళలు పూల జల్లులు కురిపిస్తూ, హారతులు పడుతూ బాబుకు స్వాగతం పలికారు. కుమ్మరిపాలెం కిక్కిరిసిపోగా, బ్రాహ్మణవీధి పసుపు సైన్యం కవాతు తొక్కినట్లుగా మారింది.

ఇక కెనాల్ రోడ్డు కాలి నడకకు కూడా దారి దొరకడం కషఫ్టమైపోయింది. బాబూ రావాలి జాబు ఇవ్వా లంటూ ఆయన నడక సాగినంత దూరం యవ కేరింతలు, నినాదాలతో మారు మోగిపోయింది. గడప గడపా ఇళ్ళు వదిలి బాబును చూడటానికి జనం బయటకు వచ్చి నిలబడ్డారు. మహిళలు, వృద్దులు సైతం బాబుకు స్వాగతం పలకడంలో పోటీ పడ్డారు. బేతాళ నృత్యాలు, హారతులతో వీర తిలకాలు దిద్దుతూ స్వాగతం పలికారు.

భవానీపురం, కుమ్మరిపాలెం సెంటర్, అమ్మవారి కొండ దాటాక బ్రాహ్మణవీధి, కెనాల్ రోడ్డు కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంతాల్లో పోగయిన జన సందోహం శివరాత్రి సందడిని తలపించింది. వస్త్ర వ్యాపారులు, తోపుడు బళ్ళ వ్యాపారులు, ఎదురొచ్చి బాబును కలసి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. రాత్రి బస చేసే ప్రాంతమైన రాజరాజేశ్వరిపేట వీధులన్నీ జనంతో నిండిపోయాయి.