February 3, 2013

ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

ఎన్టీఆర్ హయాంలో ఆ తర్వాత తన ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి మినహా విజయవాడ నగరానికి ఎలాంటి శాశ్వత అభివృద్ధి పనులు జరగలేదని, దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న 'బెజవాడ'ను తాను అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేస్తానో ఆర్నెళ్లల్లో చేసి చూపిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. 'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి పొద్దుపోయాక రథం సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఎప్పుడో నిర్మించిన బస్టాండ్, దుర్గగుడి అభివృద్ధి పనులు, నగరంలో అవే రహదారులు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయని, కాం గ్రెస్ హయాంలో నగరానికి వీసమెత్తు అభివృద్ధి జరగలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు

తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించి కాంగ్రెస్ నాయకులు చేయలేని పనిని తాను చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ఓ మహిళను కుక్కకరిచింది..ఆమెను ఆదుకునేవారెవ్వరూ లేరు. కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని గుర్తుచేస్తూ తమ పార్టీ నాయకులు కొందరు ఆమెకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తే పోలీసులు వారిపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఇంతకన్న దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించకూడదని, టీడీపీ హయాంలో వారి పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో బేరీజు వేసుకుని చూసుకోవాలన్నారు. వ్యాట్‌ట్యాక్స్ భారంతో దుస్తుల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు చెబుతున్న సమయంలో ఆ వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.

పలువురు చిరువ్యాపారులతో చంద్రబాబు ముచ్చటించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఇద్దరు ముస్లిం యువతులు రోడ్డు పక్కగా తోపుడు బళ్లపై చిన్నపాటి వ్యాపారం చేస్తూ చంద్రబాబు కు కన్పించారు. వారి వద్దకెళ్లిన అధినేత వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకామె ఎంబీఏ చదువుతున్నానని, మరో యువతి బీఎస్సీ చదువుతున్నానని చెప్పడంతో వారి పరిస్థితి చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చలించిపోయారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. ఉపాధి లేక యువతులు ఇంటి ఖర్చుల నిమిత్తం రోడ్డెక్కుతుంటే ఈ ప్రభుత్వం ఏ మాత్రం చలించడం లేదని ఇలాంటి ఆణిముత్యాలకు తమ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే సరైన ఉద్యోగాలు కల్పిస్తామని స్థానికుల హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి దారుణంగా ఉండటంతో చాలామంది జనరేటర్లను కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని, తీరా వాటిపై కూడా వ్యాట్‌ను విధించిన ఘనత కాంగ్రెస్‌కే చెల్లిందంటున్న తరుణంలో వ్యాపారుల నుంచి భారీ స్పందన కన్పించింది. జనం రానున్న ఎన్నికలలో ఓటును 'ప్రధానాస్త్రం'గా వాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన క్షణమే విజయవాడను ఏ విధంగా అభివృద్ధి ఏమిటో ఆరు నెలల్లో చేసి చూపిస్తామన్నారు.