September 6, 2013

విభజనపై పరిశీలనకు అఖిలపక్ష కమిటీ


రాజ్యసభలో టిడిపి డిమాండ్‌
ఆంధ్రాకు వచ్చి
మా బాధలు చూడండి : రమేష్‌

విభజనను వ్యతిరేకిస్తాం : ఎస్‌.పి.


  పార్లమెంట్‌కు తెలంగాణా సెగ వదలటంలేదు. సీమాంధ్రకు చెందిన ఎం.పి.లు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సభలో గందరగోళం సృష్టి స్తూనే వున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలుగు దేశం పార్టీ సభ్యులు ప్రస్తుతం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితిపై అధ్యయనం చేసి, ఈ అంశాన్ని పరిశీ లించేందుకు అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేయాలని గురువారం రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. సభ జీరో అవర్‌లో టి.డి.పి. సభ్యులు సి.ఎం. రమేష్‌ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటిస్తే అక్కడి ప్రజల బాధలు తెలు స్తాయని, అందుకని సీమాంధ్రలో పర్యటించవల సిందిగా సభ్యులను కోరారు. సీమాంధ్రలో ఆందో ళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటంలేదని, రాష్ట్ర విభజనపై ఒక వైపు కమిటీ వేస్తామని చెప్పి మరో వైపు విభజన ప్రక్రియను వేగం చేస్తామని ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

''ఆంధ్రప్రదేశ్‌ మొత్తం మండుతోంది...గడిచిన 35 రోజులుగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందో ళనలకు ప్రభుత్వం స్పందించటంలేదు. సమస్యను నిర్లక్ష్యం చేస్తోంది'' అని రమేష్‌ అన్నారు. స్వాతంత్య్ర పోరాటం తరహాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయని, కాని ప్రభుత్వం మాత్రం చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహారిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెపుతుండగా, ప్రభుత్వం ఇటీవల తెలంగాణా ఏర్పాటు క్రమం ఊపందుకుందని ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆందోళనను ఆయన పునరుద్ఘాటించారు. ఈ అంశంపై తక్షణం చర్య తీసుకోవాలని రమేష్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ సహచరులు వై.ఎస్‌. చౌదరితో కలిసి ఈ అంశంపై సమావే శాలు ప్రారంభమైన ఆగస్టు 5వ తేదీ నుండి సభలో రమేష్‌ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభలో ఆయన తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనను వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. ఈ అంశాన్ని పరిశీలిం చేందుకు అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల సభ్యులు డిమాండ్‌ చేశారు.