September 6, 2013

కోదండరాం ప్రొఫెసర్‌లా మాట్లాడాలి : టీడీపీ

తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాం ప్రాఫెసర్‌లా మాట్లాడాలని టీడీపీ పార్లమెంట్ సభ్యులు పేర్కొన్నారు. ఆయన ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఏకాభిప్రాయం ద్వారానే జరగాలని కొనకళ్ళ నారాయణ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని నిమ్మల కిష్టప్ప అన్నారు. సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీస్తోందని ఆయన అన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాం«ధలో ఉద్యమం ఉధృతంగా జరుగుతోందని, కేంద్రం పట్టించుకోవడంలేదని సుజనా చౌదరి విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

సీమాంధ్ర ఉద్యమంలో చెడును చూపిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో అలా చూపించలేదని మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టకముందే ఇలా ఉంటే, రేపు బిల్లు పెడితే ఎలా ఉంటుందో ప్రజలే ఊహించుకోవాలని మోదుగుల పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించారని సీఎం రమేష్ ఆరోపించారు. శనివారం ఎపీ ఎన్జీవోలు నిర్వహించనున్న సభకు ఆయన మద్దతు తెలిపారు.