September 6, 2013

విజన్‌ 2020ని 420గా మార్చారు



వైకాపా యాత్రల స్క్రిప్ట్‌ ఏఐసీసీదే
ముఖ్యమంత్రి కిరణ్‌ అసమర్ధుడు

బొత్స ఉత్సవ విగ్రహం
స్విస్‌ బ్యాంకుల సొమ్ము రాబడితే దేశంలో అప్పులు మాయం


 
తెలుగు జాతి ఆత్మ గౌరవ పరి రక్షణకు కంకణం కట్టుకున్న తాను తెలుగుజాతిని కాపాడుకుంటానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో తెలుగు జాతీ ఆత్మగౌరవ యాత్ర ఐదో రోజున తాడికొండ మండలం మోతడక, నిడుముక్కల, రావెల, పొన్నెకల్లు కంతేరువరకు సాగింది. ఈ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ దొంగల ఆస్తులు, స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకుంటే భారతదేశం అప్పులన్నీ తీరిపోతాయని, అంత డబ్బు కాంగ్రెస్‌ నాయకుల వద్ద ఉందని డిమాండ్‌ చేశారు. అలాగే వైఎస్‌ పాలనలో తండ్రిని అడ్డంపెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నాడని అందుకే జైలులో ఉన్నాడని అతని అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో లక్ష కోట్ల దోపిడీకి కారకుడైన దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి తన దోపిడీ సొమ్ములో వారానికి వంద కోట్ల రూపాయలు ఢిల్లిdకి ముడుపులు చెల్లించడంతో వైఎస్‌ అవినీతిపై సోనియాగాంధీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విద్యార్థి, యువతే దేశానికి ఆయువు పట్టని టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామని ఉత్తమ చదువులు అందిస్తే ప్రపంచాన్ని శాసించగల రనే ఉద్దేశంతో అనేక ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే దేశంలోనే ఎవ్వరూ చేయలేని విధంగా ఐటీ రంగాన్ని హైదరాబాద్‌ను అభివృద్ధి పరిచి ప్రపంచ పటంలో స్థానం సంపాదించామ న్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పర్చేం దుకు తాను విజన్‌ 20-20 తయారు చేస్తే కాంగ్రెస్‌ పార్టీ దొంగలు దాన్ని 420గా మార్చా రని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ నాయకులు కుట్రపన్నితే అందుకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లోపాయి కారిగా సహకరిస్తున్నారని బాబు ఆరోపించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ యాత్రలకు స్క్రిప్ట్‌ ఏఐసీసీ ఆఫీస్‌ నుంచి అందుతున్నదన్నారు. అలాగే మొద్దాబ్బాయి రాహుల్‌గాంధీ ప్రధానిగా, దొంగబ్బాయి జగన్‌ ముఖ్యమంత్రి కావాలని రాజకీయాలు నడుస్తున్నాయని ఇదే జరిగితే తెలుగు జాతి పిల్లల భవిష్యత్తు ఏమోతుందో ఆలోచించాలని చంద్రబాబు ప్రజలకు కోరారు. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సోనియాగాంధీ చేతిలో తోలుబొమ్మని, కోల్‌గేట్‌ కుంభకోణంలో ఫైళ్లను కాపాడలేని పిఎం దేశాన్ని ఏమి రక్షిస్తాడని బాబు ప్రశ్నించారు.