June 20, 2013

బాబుకు కోర్టులు క్లీన్‌చిట్టిచ్చాయి


  తెలుగుదేశం పార్టీ హయాంలో ఐఎంజీ భూకేటాయింపులపై వైఎస్‌ మొదలుకుని విజయమ్మ వరకు కోర్టునాశ్రయిస్తే చివాట్లు పెట్టిన విషయాన్ని విస్మరించి, వైసీపీ నేతలు తిరిగి విచారణ చేపట్టాలని కోరడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ సీనియర్‌ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. టీడీపీ హయాంలో జరిగిన భూకేటాయింపులపై వైఎస్‌ నుండి మొదలుకుని విజయమ్మ వరకు అంతా కోర్టుకు వెళ్లారని, అయినా ఎటువంటి పోరపాట్లు జరగలేదని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయని గుర్తు చేశారు. ఇంతవరకు ఐఎంజీ భూకేటాయింపులను న్యాయస్థానం తప్పుపట్టిన సంఘటనలు లేవన్నారు. టీడీపీ పాలనపై జరిగిన భూకేటాయింపులపై ఏర్పాటు చేసిన సభాసంఘాలు, విచారణ కమిటీల్లోనూ ఏమి తేల్చ లేకపోయారన్నారు.

గురువారం టీడీఎల్పీ కార్యాలయంలో కేశవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాబు నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంకా ఎన్ని కోర్టులు కావాలంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ కోర్టులు ఏమైనా కావాలా? అని అపహాస్యం చేశారు.చంద్రబాబు హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణకు ఆదేశిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, నిజ, నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. అలాగే వైఎస్‌ ఆరేళ్ల పాలనలో జరిగిన భూకేటాయింపులపైనా వైసీపీ నేతలు విచారణ కోరితే బాగుంటుందన్నారు. ఐఎంజీ వ్యవహారంలో సీబీసీఐడీ నివేదికను విజయమ్మ చదవాలని సూచించారు. ఐఎంజీ భూకేటాయింపుల్లో ఎటువంటి పోరపాట్లు జరగలేదని సాక్షాత్తు వైఎస్‌ సర్కారే తేల్చి చెప్పినప్పటికీ, నిసిగ్గుగా వైస్సార్సీపీ నేతలు అసెంబ్లీలో విచారణకు పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అసెంబ్లీ వేదికగా కొత్త నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు.