June 20, 2013

పీర్పీని కాంగ్రెస్‌కు అమ్మేశారు: ముద్దు


సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేసిన పీఆర్పీని కాంగ్రెస్‌పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేశారని టీడీపీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. పార్టీని నడిపేందుకు చేతకాకుండా పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేసినా అదే పార్టీలో ఉంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం సిగ్గుచేటన్నారు. ఎన్టీరామారావు చనిపోగా పార్టీలో చీలికలు వచ్చిన ఓ వర్గంలో ఉన్నానని అప్పుడు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి నా ఇంటికి వచ్చి బతిమిలాడి పార్టీలో చేర్చుకున్నారని గాలి వివరించారు. 1999 స్థానిక ఎన్నికల్లో ఆరు జడ్పీటీసీలకు గాను 5 గెలుచుకొని జిల్లాలో కాంగ్రెస్‌పార్టీని బతికించానని, అనంతరం తనను పావుగా వాడుకోవటాన్ని సహించలేక టీడీపీలో చేరినట్లు తెలిపారు.

చంద్రబాబు 2020 విజన్‌ను చూసి కాంగ్రెస్‌పార్టీ నేతలు బెంబేలెత్తారన్నారు. జైపాల్‌రెడ్డి, ఉపేంద్రలాంటి ఎంతో మంది కాంగ్రెస్‌ను తిట్టిపోసినవారేనని నేడు ఆపార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సభ పక్కదారి పట్టడాన్ని గమనించిన డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క పద్దుపైనే చర్చించాలని రూలింగ్‌ ఇచ్చారు.