June 20, 2013

నాడు వైఎస్‌ఆర్‌.. నేడు కేసీఆర్‌ వసూల్‌రాజాలు

దివంగత వైఎస్‌ఆర్‌ మార్కు అవినీతి కార్యకలాపాలను రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం విరుచుకుపడింది. ఆ పార్టీ గురువారం గన్‌పార్క్‌లో భూ ఆక్రమణలకు, సెటిల్‌మెంట్లకు వ్యతిరేకం గా ధర్నా నిర్వహిం చింది. ఆ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సండ్ర వెంకట వీరయ్య తదితరులు మాట్లాడారు. అనేక మంది పారిశ్రామిక వేత్తలను దోచుకున్న ఘరానా దొంగ కేసీఆర్‌ అని తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ రౌడీ మూకలు హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు చేసేవి. ఇప్పుడా పనిని ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ చేస్తోంది. నగరంలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఒక విద్యా సంస్థ, ఆస్పత్రిని నిర్మించాలన్నా టీఆర్‌ఎస్‌ వారికి ముడుపులు చెల్లించాల్సిం దేనని చెప్పారు. తొలుత వారికి వ్యతిరేకంగా ఒక ప్రకటన జారీ చేస్తారు. ఏదో విధంగా వారిని కాళ్ల బేరానికి తీసుకువస్తారు. తెలంగాణ భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని అందినంతా దండుకుంటున్నా రని నిప్పులు చెరిగారు. చివరకు ఏ సినిమా ఏ థియేటర్లో ఎన్ని రోజులు ఆడాలో కూడా టీఆర్‌ఎస్‌ వారే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని పక్కకుబెట్టి ఆ పార్టీ ఆర్థిక అరాచకాలకు పాల్పడుతోందన్నారు. ఉద్యమాలా? వసూళ్లా? వేటిని ఆచరిస్తారో టీఆర్‌ఎ-స్‌ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై తొలుత చేసిన ప్రకటన ఏమిటి? ఒకటి రెండు రోజుల్లోనే దానిని గాలికి వదలడం వెనక మతలబు ఆ పార్టీనే తెలపాలన్నారు. కేసీఆర్‌, అతని కుటుంబ సభ్యులను నమ్మరాదని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌పై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పలేక తెలంగాణ వాదులపై ప్రతిదాడికి ఆ పార్టీ పాల్పడుతోందన్నారు. తెలంగాణ రావడం కేసీఆర్‌కు అస్సలు ఇష్టం లేదు. ఆయనకు కావల్సింది కేవలం డబ్బులేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే సమయంలో సకల జనుల సమ్మెను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దని దుయ్యబట్టారు. తాను పోగేసిన అక్రమ సంపాదనను నెల్లూరుకు చెందిన బడా బిల్డర్‌ సుబ్బారెడ్డి దగ్గర దాయడం అబద్దమా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కేసీఆర్‌ను విశ్వసించడం లేదన్నారు. తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.