June 7, 2013

తెలుగుదేశం దిశగా సీమాంధ్రవలసలు!


ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశం వైపు వలసలు నెమ్మదిగా సాగుతుంటే..సీమాంధ్ర ప్రాంతంలో ఈ పార్టీవైపు కాస్తంత వేగంగా వలసలు పుంజుకునేలా కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర ఏరియాలో ఏమీ అనుకూలమైన పరిస్థితులు కనపడటం లేదు. అంతర్గత కలహాలతో అట్టుడుకుతున్న, తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ను నమ్ముకుని ప్రయోజనం లేదని అటు నాయకులు, కార్యకర్తలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ పార్టీ పరిస్థితి కూడా ప్రస్తుత పరిణామాల మధ్య ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో వలసవాదులకు తెలుగుదేశం పార్టీనే కాస్తంత విశ్వసనీయమైన గూడుగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా చెదరని క్యాడర్ ఉండటం, సీమాంధ్ర ప్రాంతాల్లో నమ్మకమైన ఓటు బ్యాంకు ఉండటం టీడీపీకి అనుకూలమైన పరిస్థితులుగా మారాయి.

ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ నేతలను తెలుగుదేశం పార్టీ ఆకర్షిస్తోంది. ఇప్పుడు గనుక తెలుగుదేశం అధ్యక్షుడు కాస్తంత చొరవ తీసుకుని... సంప్రదింపులు జరిపితే... ఎగిరి రావడానికి చాలా మంది కాంగ్రెస్ నేతలే సిద్ధంగా ఉన్నారు! వీరి లో కొందరు మాజీ మంత్రులు, ప్రస్తుతం పదవిలో ఉన్న మంత్రులు కూడా ఉండటం విశేషం! ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం అగ్రనాయకత్వాన్ని ఈ విషయంలో సంప్రదింపులు జరిపారని వినికిడి. అయితే మరీ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న నాయకుల విషయంలో తెలుగుదేశం అచితూచి అడుగులు వేస్తోంది. వలసలను ప్రోత్సహించడం ద్వారా అధికార పార్టీని మరింతగా దెబ్బ తీయడం తెలుగుదేశానికి అనుకూలమైన వ్యూహామే అయినా... ఈ విషయంలో తెలుగుదేశం కొన్ని మోరల్స్ ను ఫాలో అవుతోందని తెలుస్తోంది. మరి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నట్టుగా గేట్లు ఎత్తేస్తే...తెలుగుదేశంలోకి రావడానికి చాలా మందే రెడీ ఉన్నారని సీమాంధ్ర ప్రాంత నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం!