June 7, 2013

ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించింది వైఎస్సే:బాబు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)ను భ్రష్టు పట్టించింది, అక్రమాలకు అడ్డగా మార్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఏపీపీఎస్సీపై కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆశలు పెట్టుకుంటారని, వారికి సరైన న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ నియామక సభ్యుల ఎంపిక సరిగా లేదని ఆరోపించారు. ఏపీపీఎస్సీ సభ్యుల్లో అందరూ డిగ్రీ అర్హత ఉన్నవారే అని తెలిపారు. ఏపీపీఎస్సీ సభ్యులలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలే అని చెప్పారు. సభ్యుల ఎంపిక పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఏటా డీఎస్సీ నిర్వహించినా ఎలాంటి అవినీతి, ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం బ్రోకర్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. సమాజ సేవ కోసం పలువురు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష అందరిలో ఉందన్నారు.