June 7, 2013

ఇది బ్రోకర్ల రాజ్యం



 రాష్ట్రం బ్రోకర్ల రాజ్యంగా మారిపోయిందని, ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, లక్షలాది మంది నిరుద్యోగులను వంచిస్తున్నారని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెవిపి రామచంద్రరావు పోషించిన పాత్రను ఇప్పుడు ఆయన సోదరుడు పోషిస్తున్నాడని ఆరోపించారు. శుక్రవారం బాబు ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దేశమంతా తిరిగి వచ్చాక ఆయన తమ్ముడు ఏ ఫైలుమీద సంతకం పెట్టమంటే దానిపై పెడుతున్నారని, గతంలో కెవిపి ఇలానే చేశారని ఆరోపించారు. ఒక తమ్ముడు తిరుపతిలో ఉండి స్మగ్లింగ్ వ్యవహారాలు చూస్తాడు, మరో తమ్ముడు హైదరాబాద్‌లో ఉండి కెవిపి రామచంద్రరావు పాత్ర పోషిస్తూ వసూళ్లు చేస్తున్నాడని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఇప్పుడున్న సర్వీస్ కమిషన్ సభ్యులందరినీ తొలగించి అర్హత గల వారిని కొత్తగా నియమించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఉద్యోగ నియామకపు నోటిఫికేషన్‌ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఒక నెల రోజుల్లో కొత్త సభ్యులను నియమించి అప్పుడు నియామకాలు చేపట్టవచ్చునని సూచించారు. ఇప్పుడున్న సభ్యులంతా రాజకీయ పార్టీల కార్యకర్తలని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వీరి నియామకం జరిగితే గవర్నర్ ఏ విధంగా ఆమోదించారని ప్రశ్నించారు. గవర్నర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నాయకులేనని తెలిపారు. రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం నా జీవితాశయం అంటూ రాసుకున్న వారిని సభ్యులుగా ఎంపిక చేశారని తెలిపారు. గుబ్బా చంద్రశేఖర్ సత్తెనపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించాడని, రోశయ్య అనుచరుడని, వైశ్య సంఘం అభివృద్ధి తన లక్ష్యం అని తన దరఖాస్తులో రాసుకున్నాడని చంద్రబాబు తెలిపారు. సీతారామరాజు హైదరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్త అని లేడీ బ్రోకర్ సంధ్యారాణి ప్లాట్‌లో పేకాట ఆడుతూ దొరికి పోయాడని తెలిపారు.
కె. రిపుంజయరెడ్డి వైఎస్‌కు పిఎగా పని చేశాడని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా వంద కోట్ల రూపాయలు సంపాదించాడని తెలిపారు. నంద్యాల మున్సిపల్ చైర్మన్‌గా పని చేసిన ఎండి నౌమన్‌ను సభ్యునిగా నియమించారని విమర్శించారు. పి. రవీందర్‌రావు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడని తెలిపారు. పిజి చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే వీరంతా డిగ్రీ చదివిన వారని అన్నారు. గవర్నర్‌కు బాధ్యత లేదా? వీరి నియామకాన్ని ఎలా ఆమోదించారో గవర్నర్ చెప్పాలని ప్రశ్నించారు. టిడిపి హయాంలో నిబద్ధత గల వారిని సభ్యులుగా నియమించినట్టు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన తలేభద్రయ్యను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా చంద్రబాబు నియమించిన విషయాన్ని గుర్తు చేయగా, ఒకరిద్దరు అలాంటి వారిని నియమించినా ఎక్కువగా విద్యావంతులనే నియమించినట్టు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి విచారణ జరిపించాల్సిన అవసరం లేదా అని అడిగారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని, కమీషన్ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయపరంగా కూడా పోరాడతామని చంద్రబాబు తెలిపారు.